Hyderabad: నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. సాయంత్రం నుంచి ఎడతెరపి లేని వర్షం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై ఎక్కడ చూసిన వరదనీరు నిలిచింది. ఫిలింనగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ లో భారీ వర్షం కురిసింది.
అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట గోల్నాక, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్, ఉప్పల్, రామాంతపూర్, హయత్ నగర్, పెద్దఅంబర్‌పేట్‌లో కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వనస్థలిపురం, ఎల్బీనగర్, మన్సూరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయం అవడంతో కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షంలో తడుస్తూ వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన జీహెచ్ ఎంసీ అధికారులు సహాయక చర్యలను చేపట్టారు.
భారీ వర్షానికి మేడ్చల్ జిల్లా కీసర నాగారం చౌరస్తాలో అందరు చూస్తుండగానే భారీ హోర్డింగ్ కుప్పకూలింది. అటుగా వస్తున్న ద్విచక్రవాహనంపై హోర్డింగ్ పడటంతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. మరికొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్లపై పడ్డాయి. తెలంగాణపై 2.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఏర్పడింది. రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయి. ఈ క్రమంలో రాగాల రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.