Gulab Cyclone: గులాబ్ తుపాన్ ప్రభావంతో వచ్చే రెండు రోజులపాటు హైదరాబాద్ నగరంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అప్రమత్తమైంది. ఈ మేరకు మూడు రోజులపాటు హై అలర్ట్ ప్రకటించింది. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, హెచ్‌ఓడీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ కాల్స్‌కు తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకోవాలని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పడవలు, పంపులు, ఇతర అవసరమైన పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని తెలిపారు. గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలను తనిఖీ చేసి నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని వివరించారు. వీకాఫ్‌లు, సెలవులు వారంపాటు పరిమితంగా తీసుకోవాలని.. సిబ్బంది అందుబాటులో ఉండేలా అధికారులు ప్రణాళిక వేసుకోవాలన్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాల్సి వచ్చినా అందుకు అనుగుణంగా పునరావాస కేంద్రాలను ముందే సిద్ధం చేసుకోవాలని, అక్కడ ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. రవాణా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరదలు, లోతట్టు ప్రాంతాల గురించి ఆయా ప్రాంతాల ప్రజలను ముందస్తుగా హెచ్చరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వెల్లడించారు.