GHMC Budget: జీహెచ్‌ఎంసీని తాకిన వరి వార్ సెగ… కౌన్సిల్ సమావేశంలో టీఆర్ఎస్-బీజేపీ కార్పొరేటర్ల రచ్చ!
GHMC బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షత కౌన్సిల్ భేటీ అయింది. తమ డివిజన్లలో సమస్యలను కార్పొరేటర్లు చెబుతుండగా TRS, BJP సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
Greater Hyderabad Municipal Corporation: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం(GHMC Council) రచ్చరచ్చ అయింది. GHMC బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మేయర్ గద్వాల విజయలక్ష్మి(Gadwala Vijaya Lakshmi) అధ్యక్షత కౌన్సిల్ భేటీ అయింది. తమ డివిజన్లలో సమస్యలను కార్పొరేటర్లు చెబుతుండగా TRS, BJP సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాగుబోతులు TRS కండువా వేసుకొని వచ్చారని BJP కార్పొరేటర్లు, బీజేపీ పనికిమాలిన పార్టీ అని, వాళ్లకి గోధుమలకు, వరికి తేడా తెలియదని TRS కార్పొరేటర్లు హాట్ కామెంట్స్ చేసుకున్నారు. రెండు పార్టీల కార్పొరేటర్లు పోడియం వద్దకు దూసుకెళ్లారు. కేకలు వేస్తూ నెట్టుకున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సర పద్దుకు ఆమోదం తెలిపేందుకు బల్దియా పాలకమండలి మంగళవారం సమావేశమైంది. ఈ భేటీలో అధికార టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మాటల మంటలతో రగిలిపోయింది. రాజకీయ విమర్శలతో మొదలైన వాగ్వాదం నిండు సభలో కార్పొరేటర్ల తోపులాట వరకు వెళ్లింది. మార్షల్స్ ఎంట్రీతో కూడా వివాదం సద్దుమణగకపోవడంతో మేయర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది. తర్వాత వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపి.. మధ్యాహ్నం ప్రశ్నోత్తరాలు నిర్వహించారు..
వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం జీహెచ్ఎంసీ పాలకమండలి కౌన్సిల్ సమావేశమైంది. 6 వేల 150 కోట్ల రూపాయలతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో రెవెన్యూ ఆదాయం రూ.3 వేల 434 కోట్లు, వ్యయం రూ. 2 వేల 800, మిగులు రూ.634 కోట్లుగా బడ్జెట్‌లో చూపించారు. మూలధన వ్యయంలో రోడ్ల అభివృద్ధి స్కై వేలు, అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్లు, రానున్న వర్షాకాలం దృష్ట్యా నాలాల అభివృద్ధి పనులకు పెద్దపీట ఇచ్చారు.
గ్రేటర్ పద్దుపై చర్చన ప్రారంభించిన కార్పొరేటర్లు.. పలు రాజకీయ విమర్శలు చేయడంతో సభలో దుమారం చేలరేగింది. టీఆర్ఎస్ కార్పోరేటర్ మన్నె కవితా రెడ్డి బీజేపీ కార్పొరేటర్లను ఉద్దేశిస్తూ వరికి.. గోధుమలకు తేడా తెలియని పార్టీ అంటూ సెటైర్లు వేశారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కవిత ప్రసంగ ముగిసిన తర్వాత బీజేపీ కార్పొరేటర్ వంగా మధసూదన్ రెడ్డి మాట్లాడుతూ మేయర్ కు బీజేపీ కార్పొరేటర్ల డివిజన్లలో ఎమ్మెల్యేల అనుమతి లేకుండా తిరిగే దమ్ము ధైర్యం లేదంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారానికి దారితీశాయి. ఒక్కసారిగా టీఆర్ఎస్ కార్పొరేటర్లు దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేయగా.. తాగుబోతుల టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోని సభకు వచ్చారంటూ వంగా మధూసూదన్ మరో ఘాటు విమర్శ చేశార. దీంతో ఆవేశంతో టీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియం, బీజేపీ కార్పొరేటర్ల సీట్ల వైపు దూసుకెళ్లారు. ఇరు పార్టీలకు చెందిన కార్పొరేటర్ల దూషణలు, కౌంటర్లతో సభ అట్టుకుడిపోయింది. ఇరు పార్టీల కార్పొరేటర్లు మేయర్ ముందే తోపులాటకు దిగారు. మార్షల్స్ వచ్చి అడ్డుకున్న రచ్చ ఆగలేదు. దీంతో మేయర్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.
తిరిగి ప్రారంభమైన జనరల్ బాడీ మీటింగ్ లో బడ్జెట్‌పై చర్చ ముగించి సభ ఆమోదం తెలిపింది. లంచ్ బ్రేక్ తర్వాత కార్పొరేటర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. ఇందులో నాలాలు, డ్రైనేజీలు, టౌన్ ప్లానింగ్, ఆక్రమణలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంశాలై చర్చ జరిగింది. ముఖ్యంగా జలమండలి పరిధిలోకి వెళ్లిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని తిరిగి జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకోవాలని బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జలమండలి అధికారులు పనులు సరిగా చేయట్లేదని.. బస్తీల్లో తాగునీరు మురికి నీరుగా మారుతుందని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వాటర్ బోర్డు ఎండీని కలుద్దామని వెళ్లినా టైం ఇవ్వడం లేదని.. జలమండలి నిర్లక్ష్యం నగరవాసుల ప్రాణాలు బలితీసుకుంటుందని ఆరోపించారు.
మేయర్ కు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు మధ్య గ్యాప్ ఉందని బీజేపీ కార్పొరేటర్లు చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖండించారు. మంత్రితో మేయర్ సమన్వయం చేసుకుంటూ నగరంలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు వారు చెప్పారు. మొత్తంగా బల్దియా వార్షిక్ బడ్జెట్ సమావేశం కాస్త వ్యక్తిగత దూషణలు, విమర్శలతో రసాభాసగా మారింది. నగరంలో సమస్యలను అన్ని పార్టీల కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా.. సమాధానాలతో మాత్రం ఎవరు సంతృప్తి వ్యక్తం చేయలేదు.