Review on Graduate MLC Election : పట్టాభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు సిద్దమవుతున్నారు. ఎన్నికల నిర్వహణకు అనుసరించాల్సి వ్యుహంపై కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ – రంగారెడ్డి- హైదరాబాద్ పట్టాభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ సమీక్షించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశమైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ.. పట్టాభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 5.60 లక్షల మంది ఓటర్లున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 169 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎల్బీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియాన్ని తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు.
కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నోడల్ అధికారులకు సూచించారు. అలాగే పోలింగ్ స్టేషన్ వద్ద వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్న లోకేశ్ కుమార్.. ఎన్నికల నిర్వహణకు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రియాంక అలాను రిటర్నింగ్ అధికారిగా నియమించినట్లు ఆయన తెలిపారు. నామినేషన్లను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం 3వ అంతస్తులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరిస్తారని పేర్కొన్నారు. దివ్యాంగులు, 80 ఏండ్లు నిండిన వృద్ధులు, కొవిడ్ రోగుల వద్దకే ఎన్నికల సిబ్బంది వెళ్లి ఓట్ల వేయిస్తారని స్పష్టం చేశారు.