Hyderabad: ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. వెలుగులోకి ఆశ్చర్యకర విషయాలు..
హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. భారీగా ప్రాన్స్, చేపలను స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచుతున్నారనే కారణంతో వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని హోటళ్లు, రెస్టారెంట్లను సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. నిల్వ కోం కార్బోనేట్ పౌడర్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

మహానగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా మంగళ్‌హాట్‌లోని పచ్చి బజార్‌లో గోల్కొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో ప్రాన్స్, చేపలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగాయి. అధికారుల సమాచారం ప్రకారం, శంకర్ సింగ్, గులాబ్ సింగ్‌లు వివిధ మార్కెట్ల నుంచి తక్కువ ధరకు ప్రాన్స్, చేపలను కొనుగోలు చేసి, ఓ ఇంట్లోనే సుమారు 150 కిలోల మేర నిల్వ ఉంచి నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో నిల్వ కోసం కాల్షియం కార్బోనేట్ పౌడర్ ఉపయోగిస్తున్నట్లు, అలాగే ప్యాకెట్లపై ఏడాది వరకు నిల్వ ఉండేలా ఎక్స్‌పైరీ వివరాలు ముద్రించినట్లు అధికారులు గుర్తించారు.
ఈ కేసులో శంకర్ సింగ్, గులాబ్ సింగ్, రోహిత్, మాన్‌సింగ్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. స్వాధీనం చేసుకున్న ప్రాన్స్, చేపల నమూనాలను నాణ్యత పరీక్షల కోసం సంబంధిత ప్రయోగశాలకు పంపించారు. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా పాతబస్తీ తాడ్‌బన్‌లోని ఓ పరాటా తయారీ కేంద్రంపై H-FAST అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో తీవ్ర పరిశుభ్రత లోపాలు బయటపడ్డాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీ, నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాల నిర్వహణతో పాటు 01-07-2026 తేదీతో ముందుగానే ప్యాకేజింగ్ చేసిన ఉత్పత్తులను గుర్తించారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చర్యల కోసం బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.
