Ex-wife threatens her husband : ప్రోపర్టీ డాక్యుమెంట్స్ ఇస్తావా.. ముఖం మీద దగ్గమంటావా.. ? ఏంటి తేల్చు.. అంటూ ఓ మాజీ భార్య వేధింపులకు దిగింది. దీంతో వృద్ధుడైన భర్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని నందగిరి హిల్స్ లో గతనెల 31వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. వివాదం వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో నివసించే ఒక వ్యాపారి సంజీవరెడ్డి(70) ఓ మహిళను(38)ను వివాహం చేసుకోగా వీరికి 17 ఏళ్ల ఒక కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో సంజీవరెడ్డి ప్రశాసన్‌నగర్‌లో భార్య పేరిట ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే, తరువాత ఆ మహిళ మరొకరిని వివాహం చేసుకొని వెళ్లిపోగా, తండ్రి, కుమారులిద్దరూ నందగిరిహిల్స్‌లోనే నివసిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మాజీ భార్య తన ఇంటికి వచ్చి కొవిడ్ పాజిటివ్ ఉందంటూ వైరస్ అంటిస్తానంటూ బెదిరింపులకు దిగిందని భర్త పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రశాసన్ నగర్ ఇంటికి సంబంధించిన ఆస్తి పత్రాలిస్తావా.. లేదంటే నీ ముఖంపై దగ్గమంటావా..! అసలే నాకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందంటూ ఆమె ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిందని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 447, 341, 506 సెక్షన్ 3 ఎపిడమిక్ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.