అధికారులు, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అక్రమాలు మాత్రం ఆగడం లేదు. అధికారుల కన్నులు గప్పి అవినీతి దందాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో డ్రగ్ రాకెట్ గుబులు రేపుతోంది. మొన్నటికి మొన్న మాదాపూర్‌లో బయటపడ్డ డ్రగ్ మాఫీయా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశాల నుంచి డ్రగ్స్ యథేశ్చగా దేశంలోకి డంప్ అవుతోంది. దీనికి విమానాశ్రాయాలే కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. అధికారుల తనిఖీల్లో అడపాదడపా డ్రగ్స్ బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా భారీగా డ్రగ్స్ బట్టబయలయ్యాయి. ఏకంగా రూ. 50 కోట్లు విలువైన మాదక ద్రవ్యాలు బయట పడడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు విమానంలో ల్యాండ్ అయ్యాడు. అయితే అప్పటికే విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు ఆ ప్రయాణికుడి బ్యాగ్‌ను తనిఖీలు చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 5 కిలోల కొకైన్ లభ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డ్రగ్ విలువ అక్షరాల రూ. 50 కోట్లు కావడం గమనార్హం.
ఓ సూట్‌కేస్‌తో పాటు ఉమెన్ హ్యాండ్ బ్యాగ్‌ల అడుగు భాగంలో కొకైన్ పట్టుబడింది. పొడి రూపంలో మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లే ప్రయత్నంలో ఉండగా ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ డ్రగ్స్ రాకెట్‌లో ఇంకా ఎవరు ఉన్నారన్నదానిపై డీఆర్‌ఐ అధికారులు దృష్టిసారించారు. ఆ దిశగా విచారణ ప్రారంభించారు.
హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టులో పట్టుబడుతోన్న మాదక ద్రవ్యాలకు సంబంధించిన సంఘటనలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గడిచిన జులైలో ఏకంగా రూ. 14.2 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడడంతో అంతా షాక్ అయ్యారు. ఇక మే నెలలో కూడా రూ. 41 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడింది. అలాగే గతేడాది మేలో కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 125 కోట్ల హెరాయిన్ లభ్యమైంది. ఇక 2021లోనూ ఇద్దరు మహిళల నుంచి రూ. 78 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..