
హైదరాబాద్ మహానగరం అంటే గొప్ప పర్యాటక ప్రదేశాలకు పెట్టింది పేరు.. అదే విధంగా మంచి వ్యాపార కేంద్రంలా కూడా విరాజిల్లుతోంది. ఇక్కడ బతుకుదెరువు కోసం వచ్చి జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉంటారు. మినీ ఇండియాగా విద్య, వైద్యం, వ్యాపారం, ఉద్యోగాలు మొదలైన వాటికి హైదరాబాద్ కేంద్ర బిందువు లాంటిది. అలాంటి ఒక మంచి వ్యాపార కేంద్రంగా భాగ్యనగరంలో ఉన్న ఒక ప్రాంతాన్ని చెప్పాలంటే అందులో ఖచ్చితంగా చార్మినార్ పరిసరాలు. అత్యంత తక్కువ ధరకు దొరికే వస్తువులు, ఇంట్లో ఉపయోగించే సామాగ్రితో పాటు మహిళలకు కావాల్సిన ఎన్నో రకాల వస్తువులకు చార్మినార్ పరిసర ప్రాంతాలే మూలం.
చార్మినార్ నీడలో నిలబడి వ్యాపారం చేసుకునే అవకాశం దొరికితే రోజుకి ఊహించనంత సంపాదించుకోవచ్చు. ఆ ఆశ ఉండి, కష్టపడే తత్త్వం ఉండాలే కానీ, దానికి అసలైన పాయింట్ చార్మినార్ పరిసర ప్రాంతాలే. కానీ చార్మినార్ నీడలో నిలబడి వస్తువులు అమ్ముకోవాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే, ఇక్కడి కొందరు పేరున్న అధికారుల సహాయంతో స్థానిక రౌడీలు రెచ్చిపోతారు. ఆ రౌడీలకు స్థానికంగా వ్యాపారం చేయాలనుకుని అనుకునే వాళ్లు ఖచ్చితంగా మామూళ్లు ముట్టజెప్పాల్సిందే..! జీవితం గడవాలంటే పని చేసుకుని బతుకునే ఇలాంటి వ్యాపారులు ఆ రౌడీల అహంకారానికి తల దించాల్సిందే.. అడిగినంత డబ్బు ఇచ్చి, ఎండా వానా అనుకోకుండా రోజంతా నిలబడి వ్యాపారం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
చార్మినార్ సందర్శనకు వచ్చే చాలా మంది ప్రజలు ఈ ప్రాంతంలోని దుకాణాల్లో ఏమైనా కొనడానికి సహజంగానే ఆసక్తి చూపిస్తారు. చుట్టుపక్కల ఎక్కడా దొరకని కొన్ని ప్రత్యేక వస్తువులు ఇక్కడ అమ్మడం వల్ల సందర్శకులు, స్థానికులు కొనడానికి వెళ్తారు. ప్రత్యేకంగా షాపింగ్ పనుల నిమిత్తమే చార్మినార్ వెళ్లే వాళ్లు కూడా చాలా మందే ఉంటారు. అలా వచ్చే కొనుగోలుదారుల వల్లే ఇక్కడి వ్యాపారులకు మంచి రాబడి. కానీ, షాపుల ముందర నిలబడి అమ్మాలన్నా, చార్మినార్ నీడలో అమ్మాలన్నా స్థానిక రౌడీషీటర్ల దౌర్జన్యంతో అది కుదరట్లేదని అంటున్నారు వ్యాపారస్తులు. పోలీసుల సహకారం లేనిదే తాము ఇక్కడ ఏదీ అమ్మలేకపోతున్నామని, డబ్బులు సంపాదించలేక పూట గడవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చార్మినార్ నీడలో నిలబడి వస్తువులు అమ్ముకుంటే ఏదో ఒకరోజు కోటీశ్వరులు అయిపోవడం ఖాయమని ఇక్కడున్న వ్యాపారస్తులు చెప్తూ ఉంటారు. కానీ, ఇది పైపైన మాటే. అసలు పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటుందో ఇలాంటి వ్యాపారస్తులు తమ కష్టాల గాథలు చెబితే మనం తెలుసుకోలేం. ఒక వ్యాపారం నిలబడి అమ్ముకునే స్థలం కూడా రోజుకి రూ. 500 నుంచి 1,000 రూపాయలు వరకు కిరాయి కట్టుకొని ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు అంటే ఇక్కడ ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ, అవకాశం ఉన్నా ఇలాంటి దుస్థితి వల్ల తమ బతుకు బండి ముందుకు సాగట్లేదని పలువురు వ్యాపారస్తులు అంటున్నారు. అధికారులు, పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకుని తమకు అండగా నిలబడితేనే తమ కష్టాలు గట్టెక్కుతాయని వేడుకుంటున్నారు.
చార్మినార్ ను చూడ్డానికి వెళ్తే అక్కడ అది కనిపించదు. కేవలం హ్యాకర్ మాత్రమే కనిపిస్తారు. చార్మినార్ డెవలప్మెంట్లో భాగంగా చుట్టుపక్కల అభివృద్ధి చేశారు కానీ, ఇప్పుడు హ్యాకర్ మొత్తంగా ఆక్రమించి పర్యాటకులు కనీసం నడిచే దారి లేకుండా కూడా చేశారు. అధికారులు కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక పర్యాటక కేంద్రంలో ఉండాల్సిన తీరు కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో చార్మినార్ దగ్గర నడుస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అది పర్యాటకులు కోసం కాదు హ్యాకర్ మొత్తంగా ఆక్రమించేసిన చార్మినార్ ఇది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..