Dilsukhnagar Bomb Blast: హైదరాబాద్‌లోని దిల్‌సుక్‌నగర్‌లో భారీ బాంబు పేలుళ్ల ఘటకు ఎనిమిదేళ్లు పూర్తయింది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ పేలుళ్ల ఘటనను బాధిత కుటుంబ సభ్యులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఈ పేలుళ్లలో దాదాపు 17 మంది మృతి చెందారు. ఎందరో గాయపడ్డారు. అప్పట్లో సంచలనం సృష్టించిన పేలుళ్ల ఘటన భయంకరమైన దృశ్యాలు బాధితుల కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉంది. ఈ పేలుళ్లకు కారకులైన ఐదుగురు ఉగ్రవాదులకు ప్రత్యేక కోర్టు మూడేళ్ల అనంతరం మరణ శిక్ష విధించింది. 150 మీటర్ల వ్యాసార్థంలో రెండు పేలుళ్లు జరిగాయి. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండు ఎదురుగా రద్దీగా ఉండే ప్రాంతంలో సైకిల్‌పై ఉగ్రవాదులు బాంబులు అమర్చారు. టిఫిన్ బాక్సులో పెట్టిన బాంబులు పేలడంతో దాదాపు 17 మంది మరణించగా, 130 మందికిపైగా గాయపడ్డారు. ఈ జంట పేలుళ్లకు ప్రధాన కారకుడైన యాసిన్ భత్కల్ అని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ కేసును విచారించిన ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు 2016 డిసెంబర్‌లో ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన ఉగ్రవాదులకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వీరిలో ఐఎం సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ కూడా ఉన్నారు. భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్ (యూపీ, జియా-ఉర్-రెహమాన్ (పాకిస్థాన్), తెహసీన్ అక్తర్ (బీహార్), ఎజాజ్ షేక్ (మహారాష్ట్ర)లకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ కేసు ఇప్పటికే హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. యాసిన్ భత్కల్ భారత్‌లో అనేక పేలుళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. భత్కల్‌పై దాఖలు చేసిన చార్జిషీట్ల ప్రకారం.. 2008 అనంతరం జరిగిన కనీసం 10 బాంబు పేలుళ్లకు ఆయన ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
న్యూఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, సూరత్‌లో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు, 2010లో బెనారస్, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పేలుళ్లు, 2011లోఎ పుణె జన్మన్ బేకరీ, ముంబై పేలుళ్లు, 2013లో హైదరాబాద్ పేలుళ్లకు యాసిన్ భత్కల్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. యాసిన్ భత్కల్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.