Darbhanga blast: : దర్భంగ పేలుళ్ల కేసులో ఎన్.ఐ.ఎ విచారణ ఇప్పుడు హైదరాబాద్ కు మారింది. జూన్ 17న బీహార్ రాష్ట్రంలోని దర్భంగ రైల్వే స్టేషన్ లో పేలిన పార్సల్ కు సంబంధించి జూన్ 30న హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన ఇమ్రాన్ మాలిక్, నజీర్ మాలిక్ అనే ఇద్దరు యువకులను హైదరాబాదులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 15న ఉబర్ క్యాబ్‌లో సికింద్రాబాద్ స్టేషన్ కు మల్లేపల్లి నుండి ఒక పార్సెల్ ను పంపించారు ఇద్దరు సోదరులు. జూన్ 17న దర్భంగ స్టేషన్ ప్లాట్‌ఫాం నెంబర్ 2 వద్దకి చేరుకున్న తర్వాత, సదరు పార్సిల్‌ను కిందికి దింపే క్రమంలో పేలుడు సంభవించింది. మొదట సాధారణ ప్రమాదంగా దీన్ని పరిగణించినా.. తర్వాత విచారణలో దీని వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ధృవీకరించారు. ఇందులో భాగంగా పార్సెల్ పంపిన ఇమ్రాన్ ను హైదరాబాద్ మల్లేపల్లి లోని వారి నివాసంలో జూన్ 30న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన హాజీ సలీం, కాఫీ ల్ అనే ఇద్దరు తండ్రి కొడుకులను ఎన్ఐఎ అరెస్టు చేసింది. ఇక, తాజాగా మాలిక్ బ్రదర్స్ కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కు కోర్టు అనుమతించడంతో శనివారం ఇద్దరు మాలిక్ సోదరులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
మొదటిరోజు విచారణలో భాగంగా బీహార్ జైల్లో ఉన్న మాలిక్ సోదరులను జైలులోనే విచారించే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే బ్లాస్ట్ కు బీజం పడింది హైదరాబాద్ లోనే కావటంతో హైదరాబాద్ నుండే ఎన్ఐఎ అధికారులు విచారణ చేయనున్నట్టు సమాచారం. పార్సల్ పంపిన విధానం.. చీరెల మధ్యలో టానిక్ బాటిల్ అమర్చి అందులో కెమికల్ ను మిక్స్ చేసి పేలుడు సంభవించెలా చేయడం తోపాటు, దానికి ముందు మాలిక్ సోదరుల కార్యకలాపాలపై విచారించనుంది జాతీయ దర్యాప్తు సంస్థ. అంతేకాదు, సరదు కెమికల్ ను పార్సిల్ లో పెట్టి సరిగ్గా ఇరవై గంటలకు పేలేలా ఆ బాటిల్ తో పాటు ఐఈడి(IED) అమర్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ప్లాన్ కు వ్యూహరచన చేసింది లష్కరే తోయిబా ముఖ్యనేత ఇక్బాల్ అయినప్పటికీ, దీనిని అమలు చేయడంలో కర్మ, క్రియ అంతా మాలిక్ సోదరులే. తమ కుటుంబ సభ్యులను సైతం బురిడి కొట్టించి ఇండియన్ రా ఏజెన్సీకి తాము ఏజెంట్లుగా పనిచేస్తున్నట్టు నమ్మించారు. మాలిక్ సోదరుల తండ్రి ఓ మాజీ సైనికుడు కావటంతో తన కుమారులకు కూడా దేశభక్తి ఉంటుంది అనే భ్రమ లో తమ కుమారులు చెప్పింది నమ్మాడు మాజీ సైనికుడు మూసాఖాన్. తమ కుమారుడు అరెస్ట్ అయిన విషయం తెలియగానే తన కుమారులు రా కోసం పని చేస్తున్నారు అని మూసాఖాన్ బహిర్గతం చేశాడు. ‘రా’ (RAW రీసెర్చ్ అనాలసిస్ వింగ్) లో పనిచేసే ఒక సీనియర్ అధికారి తమకు టాస్క్ ఇచ్చిందని అందుకోసమే 2012లో పాకిస్తాన్ వెళ్లామని మాలిక్ సోదరులు ఇంట్లో నమ్మించారు. 2012లో పాకిస్తాన్ కి వెళ్ళిన నాసిర్ మాలిక్, పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ చేత బాంబు తయారీ లో కఠోరమైన శిక్షణ తీసుకున్నాడు. 2016 లోనూ ఇప్పుడు అరెస్టయిన నలుగురు ఉగ్రవాదులు దుబాయ్ వేదికగా ఒక హోటల్లో రూమ్ తీసుకుని కలుసుకున్నారు.
ఆ తర్వాత 2021 జూన్ 17 నాడు దర్భంగ లో పేలుడు సంభవించింది. అంటే.. ఇన్ని సంవత్సరాలలో మాలిక్ సోదరుల కార్యాచరణపై ఎన్ఐఎ ఇప్పుడు లోతుగా విచారించనుంది. హైదరాబాద్ కేంద్రంగానే ఈ పార్సెల్ లో పెట్టిన రసాయనం తయారైంది. మల్లేపల్లి లో ఉంటున్న నాసిర్ మాలిక్ ఇంట్లోనే దీన్ని తయారు చేశాడని ఎన్ఐఎ చెబుతోంది. 2012 లో పాకిస్థాన్ కి వెళ్లి శిక్షణ తీసుకున్న నాజీర్ మాలిక్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడలేదనే అంశంపై కూడా ఎన్ఐఎ కూపీ లాగుతుంది. సరిగ్గా 2021 నే ఉగ్రవాదులు టార్గెట్ చేయడంపై ఎన్ ఐఎ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్ని సంవత్సరాల పాటు హైదరాబాద్ మల్లేపల్లిలో నివాసం ఉంటున్న మాలిక్ సోదరుల బాగోతంపై గుట్టు విప్పేందుకు హైదరాబాద్ నుండే తమ దర్యాప్తు కొనసాగించనుంది ఎన్ఐఎ.
మరోవైపు హైదరాబాదులో మాలిక్ సోదరులకు సహకరించిన సన్నిహితులు.. అనుచరులపై ఎన్.ఐ.ఎ దృష్టి సారించింది. ఇన్ని సంవత్సరాల పాటు ఇక్కడే నివాసం ఏర్పరచుకొని కచ్చితంగా ఇస్లాం వైపు పలువురు యువకులను ఆకర్షితులను చేసి ఉంటారని అభిప్రాయపడుతోంది. అటువంటి సానుభూతిపరుల పాత్ర పైనా ఎన్ఐఎ విచారించనుంది. ముందు ముందు ఈ కేసులో మరిన్ని అరెస్టులు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది.
Read also : Karivena Satram : శ్రీశైల పుణ్యక్షేత్రంలో కరివేన సత్రానికి వైభవంగా భూమిపూజా కార్యక్రమం