దొంగతనం చేసిందని ఓ దళిత మహిళను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌లో దారుణంగా కొట్టారు. పోలీసు దెబ్బలకు, ఆ థర్డ్‌డిగ్రీ ఎఫెక్ట్‌కి నడవలేని స్థితికి చేరుకుందా మహిళ.. కదల్లేని స్థితిలో తీవ్ర నొప్పులతో అల్లాడుతోంది.. 10 రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే యాక్షన్‌లోకి దిగింది. బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ మహిళను కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. నిజం ఒప్పుకోవాలని తల్లితోపాటు కొడుకును కూడా దారుణంగా కొట్టారు. కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి మూర్చ పోగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఫిర్యాదుదారుడితో బాధితురాలి తలకు కాళ్లకు జండుబామ్ రాయించారు.. ఆ తర్వాత ఏమన్నా జరుగుతుందేమోనని.. ఫిర్యాదుదారుడి కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో నరకయాతన అనుభవిస్తోంది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చోరీ కేసులో మహిళను చితక్కొట్టిన పోలీసులపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. షాద్‌నగర్ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశాన్ని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి కూడా సీరియస్‌గానే తీసుకున్నారు. షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామితో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ రామ్‌రెడ్డిని వెంటనే హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.
సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో 2 వారాల కిందట ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 24 తులాల బంగారం, 2 లక్షల నగదు పోయిందంటూ నాగేందర్ అనే వ్యక్తి గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కింట్లో ఉంటున్న వారిపై అనుమానం ఉందంటూ ఫిర్యాదు చేశాడు.. నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి విచారణ ప్రారంభించారు. మొదట రామ్ రెడ్డి మరో నలుగురు సిబ్బందితో సునీత, భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు.. తొమ్మిదవ తరగతి చదువుతున్న కుమారుడు 13 ఏళ్ల జగదీష్ ను అదుపులోకి తీసుకున్నారు.. తల్లి, కొడుకులను ఇద్దరినీ ఒక దగ్గరే ఉంచి వివరాలు సేకరించారు.. నిజం చెప్పడం లేదంటూ తల్లి కొడుకులను కొడుతూ తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేశారు.
డిఐ రాంరెడ్డి తన కొడుకు ముందే కొడుతూ.. చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు సునీత పేర్కొంది. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన రాత్రి వివస్త్రను చేసి.. కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ.. తన కన్నకొడుకు జగదీశ్వర్ ముందే చితకబాదారంటూ పేర్కొంది.. దొంగతనం నేరం ఒప్పుకోకపోవడంతో జగదీశ్వర్‌ను కూడా అరికాళ్ళపై లబ్బర్ బెల్ట్‌తో కొట్టారని బాధితురాలు పేర్కొంది.. కొడుతున్న దెబ్బలకు తాళలేక మూర్చపోయి స్పృహ తప్పిపోగా తనను ఇంటికి పంపించారని ఆవేదన వ్యక్తంచేసింది.. అది కూడా తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించారని పేర్కొంది..
నాగేందర్ ఇంట్లో బంగారం పోయిందని ఆరోపణలు ఎదురుకుంటున్న బాధితురాలు సునీత ఇంటి ముందు బంగారం దొరికిందని, ఈ దొంగతనం చేసింది సునీతనేనన్న ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరాచకం సృష్టించారు. అయితే మొత్తం 26 ఆరు తులాల బంగారం, 2 లక్షల నగదు పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారాని.. అందులో నుండి ఒక తులం బంగారం నాలుగు వేల రూపాయలు రికవరీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఈ దారుణ ఘటనపై షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని వివరణ కోరగా సునీత అనే మహిళపై కేసు నమోదు చేశామని ఆమెపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.. విచారణలో భాగంగా స్టేషన్ కు తీసుకు వచ్చామని అన్నారు. అయితే బంగారం ఆమె తీసుకుందని గ్యారెంటీ లేదని.. అది విచారణలో తేలుతుందన్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు రిమాండ్ ఎందుకు చేయలేదనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.. పోలీసులు కొట్టిన దెబ్బలతో ప్రస్తుతం బాధితురాలు అస్వస్థతకు గురై తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.. మరో వ్యక్తి సాయంతోనే కదిలే పరిస్థితి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ విషయం తెలిసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. నేరం రుజువైతే రిమాండ్‌కు తరలించాలి కానీ ఇలా విచక్షణారహితంగా దాడి చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈఘటన ఇప్పుడు రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. మానవ హక్కులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. పోలీస్ అధికార దుర్వినియోగానికి ఈ ఘటన నిదర్శనమని అన్నారు. మహిళపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన పోలీసులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..