Hyderabad: అరేయ్.. అలా ఎలారా..? CI ఫొటో పెట్టుకుని బంక్ ఓనర్‌కు ఫోన్ చేశాడు.. కట్ చేస్తే..

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఏకంగా పోలీస్ అధికారుల పేరుతో మెసేజ్ చేసి డబ్బులు దండుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్‌గా మాట్లాడుతున్నట్లు నటించిన ఓ కేటుగాడు, బోగారం ప్రాంతంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ మేనేజర్ హనుమంతును లక్ష్యంగా తీసుకొని చాకచక్యంగా వల వేసాడు.

Hyderabad: అరేయ్.. అలా ఎలారా..? CI ఫొటో పెట్టుకుని బంక్ ఓనర్‌కు ఫోన్ చేశాడు.. కట్ చేస్తే..
Cyber Crime

Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 11, 2025 | 4:04 PM

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఏకంగా పోలీస్ అధికారుల పేరుతో మెసేజ్ చేసి డబ్బులు దండుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌కు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా మాట్లాడుతున్నట్లు నటించిన ఓ కేటుగాడు, బోగారం ప్రాంతంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ మేనేజర్ హనుమంతును లక్ష్యంగా తీసుకొని చాకచక్యంగా వల వేసాడు. ‘‘కీసర ఇన్‌స్పెక్టర్‌కు అత్యవసరంగా ఆన్లైన్ ద్వారా డబ్బులు ఇవ్వాల్సి ఉందని, త్వరలోనే బంక్ వద్దకు వ్యక్తిని పంపుతానని’’ చెప్పి హనుమంతును నమ్మించాడు. వాట్సప్‌లో తన డీపీని పోలీస్ యూనిఫాం ఫొటో పెట్టడం, ట్రూ కాలర్‌లో ‘CI’గా కనిపించేలా సెట్టింగ్ చేయడం వల్ల మేనేజర్‌కు ఎలాంటి అనుమానం రాలేదు.

ఒత్తిడి పెంచిన ఆ మోసగాడు పంపిన స్కానర్ కోడ్‌కు హనుమంతు వెంటనే 20,000 రూపాయలు సెండ్ చేశాడు.. అయితే డబ్బులు పంపిన తర్వాత కూడా ఎవరూ బంక్‌కు రాకపోవడంతో హనుమంతుకు సందేహాలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం వరకు వేచి చూసిన అనంతరం చివరకు తాను సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాననే వాస్తవం తెలుసుకున్నాడు. వెంటనే కీసర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు అకౌంట్ నెంబర్ ఆధారంగా నిందితున్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇటీవల కొన్ని రోజులుగా పోలీసుల పేరుతో, ట్రూ కాలర్ ఐడీలను మార్చి.. కేటుగాళ్లు డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారింది. అయితే.. ఇలాంటి మోసాలపై నగర పోలీస్ అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలకు మరోసారి హెచ్చరిక జారీ చేస్తూ, ఏ అధికారీ అయినా ఫోన్ ద్వారా డబ్బులు అడిగే పరిస్థితి అసలు ఉండదని స్పష్టం చేశారు. ట్రూ కాలర్‌లో కనిపించే పేరు, వాట్సప్ డీపీలు నమ్మదగిన ఆధారాలు కాదని, ఇవి కేటుగాళ్లు సులభంగా మార్చుకునే అవకాశం ఉన్నందున అలాంటి కాల్స్‌కు ఎవ్వరూ భయానికి లోనుకావొద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు నేరుగా వెళ్లి ధృవీకరించుకోవాలని, మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి డబ్బులు రికవర్ చేసుకునే అవకాశం పెరుగుతుందని పోలీసులు వివరించారు. ఇటువంటి మోసాలపై సిటీ పోలీస్ ప్రత్యేక దర్యాప్తును వేగవంతం చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..