Suravaram Sudhakar Reddy: లాల్‌ సలామ్‌ కామ్రేడ్‌.. సురవరం సుధాకర్‌ రెడ్డికి చంద్రబాబు, రేవంత్ రెడ్డి నివాళి..

హైదరాబాద్‌లోని మగ్దూం భవన్‌లో సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివదేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని.. ఆయన మృతి తీరని లోటు అంటూ పేర్కొన్నారు.

Suravaram Sudhakar Reddy: లాల్‌ సలామ్‌ కామ్రేడ్‌.. సురవరం సుధాకర్‌ రెడ్డికి చంద్రబాబు, రేవంత్ రెడ్డి నివాళి..
Suravaram Sudhakar Reddy

Updated on: Aug 24, 2025 | 5:58 PM

హైదరాబాద్‌లోని మగ్దూం భవన్‌లో సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివదేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని.. ఆయన మృతి తీరని లోటు అంటూ పేర్కొన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులర్పించి.. లాల్‌ సలామ్‌ కామ్రేడ్‌ అంటూ సంతాప సందేశం రాశారు. పాలమూరు జిల్లాకే సురవరం వన్నె తెచ్చారని, అధికారం ఉన్నాలేకపోయినా సిద్ధాంతపరమైన రాజకీయాలను జీవితకాలం ఆచరించారని రేవంత్‌ అన్నారు. సుధాకర్‌రెడ్డి జ్ఞాపకార్థం మంచి నిర్ణయం తీసుకుంటామని, కేబినెట్‌లో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు సీఎం రేవంత్‌. విలువలను జీవితకాలం ఆచరించిన వారిపట్ల ప్రభుత్వానికి గౌరవం ఉందని చెప్పారు.

సురవరం సుధాకర్‌రెడ్డి మరణం సీపీఐకే కాదు సమాజానికి తీరని లోటు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సురవరంతో సుదీర్ఘ రాజకీయ సంబంధాలు తమకు ఉన్నాయన్నారు. సురవరం చేసిన సేవా కార్యక్రమాలు, ఉద్యమాలు చిరస్మరణీయం అని చంద్రబాబు కొనియాడారు.

నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు సురవరం సుధాకర్‌రెడ్డి పనిచేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పేదల పక్షాన ఎప్పుడూ సురవరం పోరాడేవారన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు వెంకయ్యనాయుడు..

సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయానికి కేటీఆర్‌ నివాళులర్పించారు. జాతీయస్థాయిలో సురవరంతో కలిసి పనిచేసే అవకాశం బీఆర్‌ఎస్‌కు కలిగిందన్నారు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ తరపున సురవరం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి లేని లోటు మరువలేనిదని కేటీఆర్‌ అన్నారు.


విద్యుత్‌ సంస్కరణలపై సురవరం పోరాడారని ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో సపోర్ట్‌ చేశారని, సీపీఐ తరపు రాష్ట్ర సాధనకు కృషి చేశారని కొనియాడారు. ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తీసుకొచ్చేలా పార్లమెంట్‌లో కృషి చేశారని చెప్పారు ఆర్‌.నారాయణమూర్తి..

సురవరం సుధాకర్ రెడ్డికి సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు రాజా, ఎం.ఎ.బేబీ సహా పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.

గాంధీ మెడికల్‌ కాలేజీకి సురవరం పార్థివదేహం..

మగ్దూం భవన్‌లో ప్రముఖులు, ప్రజలంతా నివాళులర్పించాక గాంధీ మెడికల్ కాలేజీ వరకు సురవరం అంతిమయాత్ర కొనసాగింది. సురవరం పార్థివదేహాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగించారు. కళ్లను ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రికి డొనేట్‌ చేశారు. అంతిమయాత్రకు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..