CM Yogi Adityanath: హైదరాబాద్‌లో రాజకీయ నేతల సందడి నెలకొంది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటనతో భాగ్యనగరంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా యోగి ఆదిత్యానాథ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అమ్మవారికి మహా హారతి ఇచ్చారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. దీంతో పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం యోగి వెంట బండి సంజయ్, రాజాసింగ్, లక్ష్మణ్ పలువురు కీలక నేతలు ఉన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గాల వేళ భాగ్యలక్ష్మి ఆలయం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. దీనికి కారణం పలువురు ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు ఈ ఆలయాన్ని సందర్శిస్తుండటమే. ఇప్పటికే బీహార్ డిప్యూటీ సీఎం తారా కిశోర్ ప్రసాద్, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరులు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఇప్పుడు యోగి చార్మినార్ అమ్మవారి టెంపుల్‌ను సందర్శించడంతో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు.
అణువణువునా పోలీసుల నిఘా
యోగి ఆదిత్యనాథ్‌కు ఆలయ కమిటీ భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించింది. యోగి రాక సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో అణువణువునా పోలీసులు నిఘా పెట్టారు. భాగ్య లక్ష్మి టెంపుల్ చుట్టూ 500 మీటర్ల రేడియస్‌లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రూట్ టాప్ భద్రతను సౌత్ జోన్ పోలీసులు పటిష్టం చేశారు. మొత్తం 350మంది పోలీస్‌లతో చార్మినార్ భాగ్యలక్ష్మి లాడ్ బజార్, సర్దార్ మహల్ చూట్టూ భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, భాగ్యలక్ష్మి దేవాలయం ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌ను ఎస్పీజీ కమాండోస్ తమ అధీనంలోకి తీసుకున్నారు.