Chicken Prices: ఇప్పటికే పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు తోడు సామాన్యులకు అందుబాటులో ఉండే చికెన్ ధరలు కూడా తెలంగాణలో అమాంతం పెరిగిపోయాయి. దీంతో మధ్యతరగతి జనాలందరు లబో దిబో మంటున్నారు. హైదరాబాద్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.250 దాకా పలుకుతోంది. దీంతో ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు అన్నట్టుగా మారిపోయింది తెలంగాణలో పరిస్థితి. బర్డ్‌ఫ్లూ ప్రచారంతో కొంతకాలంగా పడిపోయిన చికెన్ ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చికెన్ ప్రియులు ఆందోళను చెందుతున్నారు.
గత మూడు నెలలుగా చికెన్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇంధన ధరలకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నాయి. గతంలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.200 ఉంటే ఇప్పుడు రూ. 252 అయింది. బోన్‌లెస్ చికెన్ ధరలలో కూడా ఇదే ధోరణి గమనించవచ్చు. జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ మొదలైన నగరాల్లో ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో చికెన్ ధరలు పెరగడానికి ముఖ్యంగా రెండు కారణాలు చెప్పవచ్చు. అందులో ఒకటి డిమాండ్ పెరగడం రెండోది పెట్రోల్ ధర పెరగడం. కరోనా వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రస్తుతం అందరు చికెన్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. మరొక విషయం ఏంటంటే ఇంధన ధరలు పెరగడంతో ట్రాన్స్‌ఫోర్ట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఈ ఎఫెక్ట్ చికెన్ ధరలపై పడుతోంది.
ఇదిలా ఉంటే చికెన్ వ్యాపారులు పెరిగిన ధరల గురించి ఈ విధంగా చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ ప్రచారంతో తెలంగాణలో కోళ్ల ఉత్పత్తిని చాలామంది ఆపేశారని, అందువల్లే ఇప్పుడు డిమాండ్‌కు తగిన సరఫరా చేయలేకపోతున్నామని పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు. డిమాండ్ అధికంగా ఉండటంతోనే ధరలు పెరుగుతున్నాయని, ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెబుతున్నారు. తాజాగా పెరుగుతున్న ధరతో పరిశ్రమ కొంత కోలుకునే అవకాశముందంటున్నారు. ఇలా అయితే చికెన్ తినడం కష్టమే అని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.