AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పండుటాకులకు పెళ్లి సంబంధాలు చూస్తామని.. పళ్లాలు బోర్లించారు

మీరు ఒంటరిగా ఉంటున్నారా..? ప్రేమగా చూసుకునే తోడు కోసం పరితపిస్తున్నారా? డోంట్‌ వర్రీ.. మేమున్నామంటూ కొంతమంది భరోసా ఇస్తున్నారు. అందమైన ప్రకటనలతో టెంప్ట్ చేస్తున్నారు. అలాంటి వాటిని నమ్మారో మీకు రంగు పడ్డట్టే. మాయనగరంలో మాయ లేడీల బుట్టలో పడ్డారో మీ జేబుకి కత్తెరపడ్డట్టే..

Hyderabad: పండుటాకులకు పెళ్లి సంబంధాలు చూస్తామని.. పళ్లాలు బోర్లించారు
Tayaramma - Swathi
Ram Naramaneni
|

Updated on: May 24, 2025 | 7:29 PM

Share

వయసుమళ్లినఒంటరి పురుషుల్ని టార్గెట్ చేసి లక్షలు కాజేసిన కిలాడీలను సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. నైస్‌గా మాట్లాడి ఐస్‌ చేయడం.. మేమున్నామనే ధైర్యమిచ్చి క్షవరం చేయడం వీళ్ల మోడస్‌ ఓపెరాండి.

ఆర్థిక ఇబ్బందుల్లోంచి గట్టేందుకు నకిలీ మ్యారేజ్‌ బ్యూరో 

కటారు తాయారమ్మ అలియాస్ సరస్వతి.. వయసు 65ఏళ్లు. ఏపీలోని కృష్ణాజిల్లాకు చెందిన ఈమె.. ప్రస్తుతం దిల్‌షుఖ్‌నగర్‌లోని పీ అండ్ టీ కాలనీలో ఉంటుంది.  ఈమె పేరు కూనపరెడ్డి స్వాతి.. స్వస్థలం కొత్తగూడెం. ప్రస్తుతం ఉండేది మల్కాజిగిరిలోని సత్యనాగేంద్ర కాలనీలో. అనుకోకుండా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా మరింత దగ్గరయ్యారు. అప్పుడే వీళ్ల మైండ్‌లో మ్యారేజ్ బ్యూరో ఫ్లాష్ అయింది. అలోచన రావడమే ఆలస్యం.. వెంటనే స్టార్ట్ చేశారు. ఇది 2019 ముచ్చట.

వయసు మళ్లినవారికి  పెళ్లి సంబంధాలు చూస్తామని పత్రికల్లో ప్రకటనలు

వయసుతో సంబంధం లేదు.. ప్రేమగా చూసుకుంటే చాలూ.. పెళ్లికి సిద్దమంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవాళ్లు. అది చూసి వీళ్లను కాంటాక్ట్ అయ్యాడు ఖమ్మంజిల్లాకు చెందిన ఓ పెద్దాయన. ఆయన హైదరాబాద్‌కు వచ్చి రాగానే ఓ హోటల్‌లో పెళ్లి చూపుల తతంగాన్ని మమ అనిపించేశారు. ఆ తర్వాత తాళిబొట్టు.. అంటూ జువెల్లరీ షాప్‌కి తీసుకెళ్లి నగలు కొన్నారు. లక్షా 77వేల రూపాయల బిల్ చేశారు. ఆ మరుసటి రోజు ఫోన్ స్విచాఫ్ చేశారు.

రిటైర్డ్ ఉద్యోగి దగ్గర రూ.14లక్షలు కాజేశారు..

తాయారమ్మ, స్వాతి చేతిలో మోసపోయానని గ్రహించిన వృద్దుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఈ పెద్దాయనే కాదూ.. అంతకుముందు చాలామందిని చీట్ చేశారు. ఓ రిటైర్డ్ ఉద్యోగి ఐదేళ్ల క్రితం భార్య చనిపోగా కొడుకు దగ్గర ఉంటున్నాడు. వీళ్లిచ్చిన ప్రకటన చూసి సంప్రదించాడు. ఆయన దగ్గర విడతల వారీగా 14లక్షలు బ్యాంక్‌ ఖాతాలో వేయించుకుని ముఖం చాటేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్వాతి, తాయారమ్మ బాధితుల్లో చాలామంది ఉన్నారు.

ఎవరైనా ఒంటరి పురుషుల్ని పెళ్లి చేసుకుంటామని వస్తే.. ఒకటికి రెండుసార్లు క్రాస్‌ చేక్ చేసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు పోలీసులు.  అవసరాన్ని క్యాష్‌ చేసుకునేందుకు తాయారమ్మ, స్వాతిలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. ఏ మాత్రం అవకాశం ఇచ్చినా డబ్బు, సమయం వృధా చేసుకున్నట్టే. ఇక హోటల్‌లో పార్కులో పెళ్లి చూపులంటే కచ్చితంగా అనుమానించాల్సిందే.