మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది.. అధికార మహాయుతి కూటమి వర్సెస్ మహా వికాస్ అఘాడి మధ్య ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం కూడా పలు స్థానాల్లో పోటీచేస్తోంది.. ఎంఐఎం అభ్యర్థుల తరఫున మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భావోద్వేగానికి గురయ్యారు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. అనారోగ్యం వెంటాడుతున్నప్పటికి , ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల ప్రచారం చేస్తునట్టు చెప్పారు అక్బర్. కిడ్నీలు పనిచేయడం లేదని, చేయి కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన శరీరంలో ఇంకా బుల్లెట్ ఉందన్నారు. ఎక్కువ మాట్లాడవద్దని, ప్రయాణాలు చేయవద్దని డాక్టర్లు సూచించారన్నారు. ఎక్కువ ప్రయాణాలు చేస్తే పేగులు చీలిపోతాయన్నారని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో పోలీసుల తీరుపై అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సభలో ఏం మాట్లాడాలో పోలీసులే చెబుతున్నారని అన్నారు. నోటీసులు కూడా ఇచ్చారని అన్నారు. నుదుటిపై బొట్టు పెట్టుకున్న వాళ్లకు ఉండే హక్కులే తలపై టోపీ పెట్టుకున్నవాళ్లకు ఉంటాయంటూ అక్బరుద్దీన్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..