Hyderabad: చిన్నారిపై వీధిశునకాల దాడి.. ఆస్పత్రికి తరలించే లోపే
హైదరాబాద్ నగరంలో వీధికుక్కలు వణుకుపుట్టిస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు.. గుంపుగా ఎగబడుతున్నాయి. పళ్లతో కొరికి, గోళ్లతో రక్కి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. పెద్ద వాళ్లపై దాడులు చేస్తున్న ఈ శునకాలు చిన్నపిల్లలపై మరింత రెచ్చిపోతున్నాయి. ఇంటిబయట...

హైదరాబాద్ నగరంలో వీధికుక్కలు వణుకుపుట్టిస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు.. గుంపుగా ఎగబడుతున్నాయి. పళ్లతో కొరికి, గోళ్లతో రక్కి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. పెద్ద వాళ్లపై దాడులు చేస్తున్న ఈ శునకాలు చిన్నపిల్లలపై మరింత రెచ్చిపోతున్నాయి. ఇంటిబయట ఆడుకుంటున్న చిన్నారులపై దాడి చేస్తున్నాయి. తాజాగా నగరంలో గోల్కొండ ఠాణా పరిధిలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధిశునకాలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలై ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. రెండున్నరేళ్ల వయసున్న అనస్ అహ్మద్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. గోల్కొండ బడా బజార్ లో రాత్రి 8.30 నిమిషాలకు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. శునకాల దాడిలో బాలుడి గొంతుపై తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన అహ్మద్ తల్లిదండ్రులు చిన్నారిని చికిత్స కోసం నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో వీధి కుక్కలు బస్తీవాసులపై దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పక్కనే ఉన్న ఖాళీ మిలటరీ ఏరియా నుంచి ఈ శునకాలు బస్తీలోకి ప్రవేశిస్తున్నట్లు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
– నూర్ మహమ్మద్, టీవీ9 తెలుగు, హైదరాబాద్
Also Read