6 గ్యారెంటీలు.. 17 ఎంపీ స్థానాలు! 100 రోజుల డెడ్‌లైన్ అంటోన్న కాంగ్రెస్..
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై.. రాజకీయ రచ్చ ముదిరింది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతుంటే, తాజాగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి.

తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై.. రాజకీయ రచ్చ ముదిరింది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతుంటే, తాజాగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. హామీల అమలుకు, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకూ.. లింకు పెట్టినట్టుగా ఆ కామెంట్స్ ఉండటం దుమారం రేపుతోంది. దీనిపై విపక్షం నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సెగలు మొదలైనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీల మధ్య అగ్గిరాజుకుని డైలాగ్ వార్ నడుస్తోంటే .. తాజాగా గ్యారంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు మరింత హీట్‌ను పెంచేశాయి. తెలంగాణలో హామీల అమలు జరగాలంటే.. కేంద్రంలో కాంగ్రెస్ రావాలనీ, రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లు గెలవాల్సిందేననీ.. సీఎం చేసిన కామెంట్స్ కాకపుట్టిస్తున్నాయి.
రేవంత్ వ్యాఖ్యల అంతరార్థం ఏదయినా.. ఒక్కసారిగా ఈ అంశం రాజకీయ రచ్చకు దారితీసింది. హామీల అమలుపై కాంగ్రెస్ మాట మార్చిందంటూ.. విమర్శలతో విరుచుకుపడుతోంది బీఆర్‌ఎస్. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఇప్పుడో మాట, మాట్లాడుతున్న రేవంత్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న గ్యారెంటీల గలాటా… పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీలకు అస్త్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హామీల అమలుపై కాంగ్రెస్ కు వందరోజుల డెడ్‌లైన్ విధించిన బీఆర్‌ఎస్.. ఆ తర్వాత ఆందోళనలకు సిద్ధమవుతోంది. తాజాగా సీఎం చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ… కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకూ ప్రయత్నిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల విజయంతో జోష్ ఉన్న కాంగ్రెస్… పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. మరి, విపక్షం విమర్శలను ఎలా తిప్పికొడుతుందో చూడాలి.
