ఆ రోజు కోసమే ఆస్తమా బాధితులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. మృగశిర కార్తె అరుదెంచే అరుదైన సందర్భాన చేప ప్రసాదం స్వీకరించేందుకు వేలాది మంది తరలివస్తుంటారు. కానీ.. ఈసారి వీరి ఆశలపై కోవిడ్ –19 నీళ్లు చల్లింది. ఆస్తమా రోగులు ఆపన్నహస్తంగా భావించే చేప ప్రసాదానికి బ్రేక్ పడింది. 175 ఏళ్లపాటు నిర్విరామంగా కొనసాగిన ఈ కార్యక్రమాన్ని కరోనా వ్యాప్తి కారణంగా పంపిణీని పంపిణీ చేయడం లేదని ప్రకటించారు బత్తిని హరినాథ్‌గౌడ్.
మృగశిరకార్తె ప్రవేశం రోజున ప్రతి ఏటా మాదిరిగానే జూన్ 7వ తేదీన దూద్‌బౌలిలోని తమ నివాసంలో సత్యనారాయణ వ్రతంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 8వ తేదీన చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉదయం 10 గంటలకు తమ కుటుంబ సభ్యులందరం తీసుకుంటామని.. అలాగే తమ దగ్గరి బంధువులకు పంపిణీ చేస్తామని అన్నారు.
కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా చేప ప్రసాదం పంపిణీని విరమించుకోవాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారని హరినాథ్‌గౌడ్ వెల్లడించారు. ప్రతి ఏటా దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది ఆస్తమా బాధితులు చేప ప్రసాదాన్ని సేవించేందుకు ఇక్కడికి వచ్చేవారని.. రెండేళ్లుగా చేప ప్రసాదం అందకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్ ఉండటంతో చేప ప్రసాదం కోసం రోగులు వచ్చేందుకు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ప్రభుత్వం చెప్పిందని, ఆ మేరకు ప్రసాదాన్ని ఇవ్వడం లేదని చెప్పారు.