నిజాంపేట, జనవరి 10: ఓ బ్యాంకు ఉద్యోగిని పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి ఠాణా పరిధిలో గురువారం (జనవరి 9) చోటు చేసుకుంది. సీఐ జె ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురానికి చెందిన కోట సత్యలావణ్య (32)కు అదే ప్రాంతానికి చెందిన బత్తుల వీరమోహన్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త ఐటీ ఉద్యోగి. వృత్తి రిత్యా సత్యలావణ్య బ్యాంకు ఉద్యోగి కావడంతో హైదరాబాద్‌లోని బాచుపల్లి కేఆర్‌సీఆర్ కాలనీలోని ఎంఎన్ రెసిడెన్సీలో వీరి దంపతులు కాపురం ఉంటున్నారు. సత్య లావణ్య బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుంది. బ్యాంకులో పని ఒత్తిడి ఉన్నట్లు తరచూ బంధుమిత్రుల వద్ద బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో సంక్రాంతికి శుక్రవారం సొంతూరుకు వెళ్లడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే గురువారం యథావిథిగా బ్యాంకు వెళ్లిన సత్యలావణ్య.. అదే రోజు మధ్యాహ్నం బ్యాంకులో ఉన్నతాధికారులకు చెప్పి ఇంటికి వెళ్లింది. ఏం జరిగిందో తెలియదుగానీ నేరుగా అపార్ట్‌మెంట్ టెర్రస్‌పైకి వెళ్లి కిందకు దూకేసి, ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రికి తరలించగా.. కొంతసేపటికే ఆమె మృతి చెందింది.
సత్య లావణ్య పనిచేస్తున్న బ్యాంకులో పెరిగిన ఒత్తిడి గురించి పలు సందర్భాలలో తనతో చెప్పిందని ఆమె మామ ARSV ప్రసాద్ పోలీసులకు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసు దర్యాప్తు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.