హైదరాబాద్‌లో శివారులో విషాదం చోటు చేసుకుంది. జవహార్‌నగర్ పరిధిలో ఉన్న మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఐదుగురు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా అంబర్‌పేట వాసులేనని గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక మదర్సా పాఠశాలలో చదివే విద్యార్థులను టూర్‌లాగా ఉపాధ్యాయుడు బయటికి తీసుకెళ్లారు. అక్కడ ఈత కొడదామని సరదాగా ఎర్రగుంట చెరువులోకి విద్యార్థులు దిగారు. అయితే చెరువు లోతును సరిగా అంచనా వేయలేకపోయారు. పిల్లలంతా మునిగిపోయారు. ఇది చూసి ఉపాధ్యాయుడు కూడా పిల్లలను కాపాడేందుకు చెరువలోకి దిగారు. పిల్లలంతా ఉపాధ్యాయుడ్ని పట్టుకోవడంతో బయటికిరాలేక అందరూ నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. కాగా మృతులందరూ హైదరాబాద్ కాచిగూడలోని నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
మల్కారంలోని మదర్సాలో ప్రత్యేక శిక్షణా తరగతుల కోసం వీరంతా వచ్చారని వారు తెలిపారు. చనిపోయిన వారిలో ఇస్మాయిల్, జాఫర్, సోహేల్, అయాన్, రియాన్.. వీరిని కాపాడేందుకు చెరువులో దూకిన వ్యక్తి యోహాన్‌గా గుర్తించారు. మృతి చెందిన విద్యార్థులంతా 12 నుంచి 14 ఏళ్ల వయసు ఉంటారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..