
హైదరాబాద్ నగరం సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు. అలాంటి సేవా దృక్పథంతో “ఆహార్ సేవ” అనే స్వచ్ఛంద సంస్థ గత కొంతకాలంగా నిరుపేదల ఆకలిని తీరుస్తోంది. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో 365 రోజులు ఉచిత అల్పాహారం అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. ఇది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో విస్తరించి, రోజువారీ సేవలను కొనసాగిస్తోంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు రంజన్ గాంధీ ఆధ్వర్యంలో, ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు అల్పాహారం పంపిణీ జరుగుతుంది. ఇడ్లీ, బోండా, ఊతప్ప, ఉప్మా వంటి నాలుగు రకాల రుచికరమైన టిఫిన్‌లను అందిస్తారు. వర్షమైనా, సెలవైనా, ఈ సేవకు ఎటువంటి ఆటంకం ఉండదు. ఉదయం 3 గంటల నుంచే టిఫిన్‌ల తయారీ ప్రారంభమవుతుంది. ఆహార్ సేవ కార్యకలాపాలు హైదరాబాద్‌లోని అనేక కీలక ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. కాచిగూడతో పాటు, శ్యామ్ మందిర్ ఎదురుగా, నిలోఫర్ హాస్పిటల్ వద్ద, పబ్లిక్ గార్డెన్ సమీపంలో, బేగంపేట్‌లోని దేవనార్ బ్లైండ్ స్కూల్‌లో, మలక్‌పేట్‌లోని డెఫ్ అండ్ డంబ్ పాఠశాలలో, ఉస్మాన్‌గంజ్‌లోని బాలసదన్‌లో, నాంపల్లిలోని సుభాన్ బేకరీ సమీపంలో కూడా ఈ ఉచిత అల్పాహార సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 5 నుంచి 6 ప్రాంతాలలో నిత్యం అల్పాహారం పంపిణీ జరుగుతుంది.
ఈ సేవలను కొనసాగించడానికి ఆహార్ సేవకు రోజుకు సుమారు రూ.20,000 ఖర్చు అవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఖర్చు మొత్తం దాతల విరాళాలతోనే సమకూరుతుంది. కేవలం ఉచిత అల్పాహారం పంపిణీకే కాకుండా, ఆహార్ సేవ సంస్థ అనాథాశ్రమాలు, అంధులు, మూగచెవిటి పిల్లల పాఠశాలలకు కూడా నిత్యం సహాయం అందిస్తోంది. రంజన్ గాంధీ, ఆహార్ సేవ అందిస్తున్న ఈ మహత్తర సేవ నిజంగా అభినందనీయం, ఎంతోమంది ఆకలిని తీర్చి, సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇలాంటి మరిన్ని బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి, ఎక్కువమందికి సేవ చేయాలని ఆకాంక్షిస్తూ, వారి సేవలను ప్రశంసించాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..