Hyderabad: గల్లీలో అనుమానాస్పదంగా ముగ్గురు మహిళలు.. పోలీసులు వెళ్లి చెక్ చేయగా
హైదరాబాద్‌ని గంజాయి విముక్త నగరంగా మార్చేందుకు అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా నడుం బిగించారు. వాళ్లు చేపట్టిన ఆపరేషన్ ధూల్‌పేట్ సత్ఫలితాలు ఇస్తోంది. గంజాయికి అడ్డాగా మారిన ధూల్‌పేట్‌ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చడానికి అధికారులు వరుస దాడులు జరుపుతున్నారు. దీంతో గంజాయి ముఠాలు హడలెత్తిపోతున్నాయి. అయితే కొందరు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
కాదేది స్టోరేజీకి అనర్హం అనే లెవల్‌లో ధూల్‌పేట్‌లో గంజాయి గ్యారేజీని రన్ చేయడం సంచలనంగా మారింది. ఖాకీలు ఈ ప్రాంతంపై స్పెషల్ నజర్ పెట్టి.. తనిఖీలు చేయగా.. కిచెన్‌లో..సంప్‌లో..వాషింగ్ మెషిన్‌లో ..కారు బంపర్‌లో గంజాయి గుప్పు మంది. ఎవరైనా వస్తే అరిచేలా కరిచే కుక్కల్ని కాపాల పెట్టుకొని మరీ కత నడిపిస్తోంది గంజాయి మాఫియా. కానీ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్ట్రిక్ట్ యాక్షన్‌తో గంజాయి గాళ్ల తోలు తీశారు. ఒకప్పుడు మత్తు మాఫియాది ఆడిందే ఆట పాడిందే పాట..అదంతా ఇప్పుడు ఒడిసిన ముచ్చట. ఇప్పుడు లెక్క మారింది.మార్పు మార్క్ మత్తు మాఫియా బెండుతీస్తోంది. గుడుంబా..గంజాయి మరే డ్రగ్స్.. అమ్మినా కొన్నా వాడినా మడతేసి కుమ్ముడే అని పోలీసులు యాక్షన్‌తో ప్రూవ్ చేశారు. దీంతో చాలామంది భయంతో వెనక్కు తగ్గారు. ఐతే నిఘా పెట్టినా సరే సరుకు సరిహద్దు దాటుతోంది. ధూల్‌పేట్ డిస్ట్రిబ్యూట్ సెంటర్ గప్ చుప్‌గా గంజాయి దందా సాగుతోంది.
తాజాగా ధూల్‌పేట బడా బంగ్లా ఏరియాలో గల్లీలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్న ముగ్గురు మహిళలను స్పెషల్ టాస్క్‌పోర్స్ టీమ్ అరెస్ట్ చేసింది. వారిని పింట సింగ్, రచన బాయి, సంజన బాయిగా గుర్తించారు. వీరి నుంచి 1.450 కేజీల గంజాయి సీజ్ చేశారు. మరో మహిళ విజయ బాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మరో కేసులో ధూల్‌పేటలోని ఓ ఇంటిపై దాడి చేసి 1.449 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కమలాబాయి, దివ్య సింగ్‌ను అరెస్టు చేయగా…నేహబాయి, దుర్గాదేవి, సంగీత సాహులు పరారీలో ఉన్నారు.
సరుకు ఎక్కడినుంచి వస్తుందో.. ఎవరు రిసీవ్‌చేసుకుంటున్నారో.. ఎక్కడి పంపిస్తున్నారో.. డేటా అంతా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరీకెక్కింది. ఇప్పటికే భారీగా గంజాయిని సీజ్ చేయడం సహా పలువుర్ని అరెస్ట్ చేశారు. మరికొందర్ని బైండోవర్ చేశారు. ఫ్యూచర్‌లో కూడా ధూల్‌పేట్‌లో మత్తు మరక ఉండకుండా పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ఎక్సైజ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..