Hyderabad: కొండాపూర్ ఫెర్టిలిటీ సెంటర్‌లో దారుణం.. సంతానం కోసం వెళ్తే ఏకంగా ప్రాణాలే తీశారు!

ఓ జంట సంతానం కలగకపోవడంతో నగరంలోని ప్లాన్ బీ ఫర్టిలిటీ సెంటర్‌కు వచ్చారు. అక్కడి వైద్యులు మహిళ గర్భ సంచిలో నీటి బుడగలు ఉన్నాయని, సర్జరీ చేయాలనీ సూచించారు. ఆపరేషన్‌ తర్వాత సర్జరీ సక్సెస్ అయిందంటూ బిల్లు కట్టించుకున్న ప్లాన్ బీ ఫర్టిలీటి యాజమాన్యం.. కాసేపటికి గుండెపోటుతో చనిపోయిందంటూ..

Hyderabad: కొండాపూర్ ఫెర్టిలిటీ సెంటర్‌లో దారుణం.. సంతానం కోసం వెళ్తే ఏకంగా ప్రాణాలే తీశారు!
Kondapur Plan B Fertility Hospital

Updated on: Jun 11, 2025 | 10:16 AM

కొండాపూర్‌, జూన్‌ 11: నాలుగేళ్ల క్రితం వివాహం జరిగిన ఓ జంట సంతానం కలగకపోవడంతో నగరంలోని ప్లాన్ బీ ఫర్టిలిటీ సెంటర్‌కు వచ్చారు. అక్కడి వైద్యులు మహిళ గర్భ సంచిలో నీటి బుడగలు ఉన్నాయని, సర్జరీ చేయాలనీ సూచించారు. ఆపరేషన్‌ తర్వాత సర్జరీ సక్సెస్ అయిందంటూ బిల్లు కట్టించుకున్న ప్లాన్ బీ ఫర్టిలీటి యాజమాన్యం.. కాసేపటికి గుండెపోటుతో చనిపోయిందంటూ బంధువులకు సమాచారం అందించారు. దీంతో ఆంగ్రహం చెందిన మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ షాకింగ్‌ ఘటన గచ్చిబౌలి కొండాపూర్‌లోని ప్లాన్ బీ ఫర్టిలిటిలో చోటు చేసుకుంది. ఫెర్టిలిటీ సెంటర్‌కు పిల్లల కోసం వెళ్లిన ఓ మహిళ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం..

ఖమ్మం జిల్లాకు చెందిన నరేశ్‌కు, సత్తుపల్లికి చెందిన పల్లవి (29) తో నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. వీరిద్దరూ కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. నరేశ్ హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. అయితే ఈ దంపతులకు పిల్లలు కలగకపోవడంతో కొండాపూర్‌లోని ప్లాన్‌ బీ ఫెర్టిలిటీ సెంటర్‌ను ఇటీవల సంప్రదించారు. పల్లవి గర్భసంచిలో నీటి బుడగలున్నట్లు గుర్తించిన అక్కడి వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో మంగళవారం (జూన్‌ 10) ఉదయం పల్లవిని హాస్పిటల్‌లో ఆపరేషన్ కోసం భర్త నరేశ్ తీసుకొచ్చాడు.

ఆస్పత్రిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆపరేషన్ చేసి గర్భసంచిలోని నీటి బుడగలను విజయవంతంగా తొలగించినట్లు డాక్టర్లు చెప్పారు. తర్వాత దానికి సంబంధించిన బిల్లు కూడా కట్టించుకున్నారు. కొద్ది సేపటికే పల్లవికి పల్స్ పడిపోయి, గుండెపోటుతో చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు ఫెర్టిలిటీ సెంటర్‌ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఫెర్టిలిటీ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యం వికటించడం వల్లే పల్లవి చనిపోయిందని ఆరోపించారు. దవాఖానపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు..అక్కడి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.