AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రిటైర్డ్ రైల్వే ఉద్యోగి హత్య కేసులో కొడుకు, కుమార్తెకు మరణశిక్ష.. భార్యకు లైఫ్ టైమ్ జైలు

హైదరాబాద్‌ మహానగరంలో సంచలనం సృష్టించిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి దారుణ హత్య కేసులో స్థానిక న్యాయస్థానం చారిత్రక తీర్పును వెలువరించింది. కేవలం ఆస్తి, పెన్షన్ డబ్బుల కోసం కన్నతండ్రినే అత్యంత పాశవికంగా చంపి, శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన కొడుకు, కూతురుకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ ఘోరానికి సహకరించిన మృతుడి భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

Hyderabad: రిటైర్డ్ రైల్వే ఉద్యోగి హత్య కేసులో కొడుకు, కుమార్తెకు మరణశిక్ష.. భార్యకు లైఫ్ టైమ్ జైలు
Court Sentenced To Death
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jun 09, 2026 | 1:22 PM

Share

హైదరాబాద్‌ మహానగరంలో సంచలనం సృష్టించిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి దారుణ హత్య కేసులో స్థానిక న్యాయస్థానం చారిత్రక తీర్పును వెలువరించింది. కేవలం ఆస్తి, పెన్షన్ డబ్బుల కోసం కన్నతండ్రినే అత్యంత పాశవికంగా చంపి, శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన కొడుకు, కూతురుకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ ఘోరానికి సహకరించిన మృతుడి భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. సమాజం తలదించుకునేలా చేసిన ఈ నరరూప రాక్షసుల ఉదంతం మల్కాజ్‌గిరి కోర్టు తీర్పుతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ప్రాసిక్యూషన్, పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. ఈ కేసులో బాధితుడైన 70 ఏళ్ల వృద్ధుడు గతంలో రైల్వే శాఖలో గూడ్స్ రైలు లోకో పైలట్‌గా పనిచేశారు. అయితే, కొన్ని వైద్య కారణాల వల్ల ఆయన 2000 సంవత్సరంలోనే స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్నారు. అప్పటినుంచి ఆయనకు వస్తున్న పెన్షన్ డబ్బులు, అలాగే ఆయన పేరిట ఉన్న సొంత ఇంటిపై కుటుంబ సభ్యుల కన్ను పడింది.తండ్రి బతికుంటే ఆ ఆస్తి, పెన్షన్ ప్రయోజనాలు తమకు దక్కవని భావించిన భార్య, కొడుకు, కూతురు ఎలాగైనా ఆయనను వదిలించుకోవాలని ఒక కిరాతక ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే, 2019 ఆగస్టు నెలలో వృద్ధుడి ఆహారంలో విషం కలిపి పెట్టారు. విషప్రయోగం వల్ల ఆయన ప్రాణాలు విడిచారు.

హత్య చేసిన తర్వాత శవాన్ని బయటకు తీసుకెళ్తే ఎక్కడ దొరికిపోతామోనని భయపడిన నిందితులు, వృద్ధుడి శరీరాన్ని అత్యంత అమానుషంగా ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఆ మానవ శరీర భాగాలను ఇంట్లోని ప్లాస్టిక్ బకెట్లలో కుక్కేసి దాచిపెట్టారు. ఆ తర్వాత ఆ అవశేషాలను ఎవరికీ తెలియకుండా పారవేయాలని చూశారు.

హత్య జరిగిన కొన్ని రోజులకు 2019, ఆగస్టు 18న ఆ ఇల్లు ఉన్న పరిసర ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన రావడం మొదలైంది. దీంతో స్థానిక నివాసితులకు తీవ్ర అనుమానం వచ్చి, ఆ ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. అక్కడ బకెట్లలో కుళ్ళిపోయిన మానవ శరీర భాగాలు కనిపించడంతో వారు షాక్‌కు గురై, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టి 2019 , ఆగస్టు 21న మృతుడి భార్య, కొడుకు, కూతురును అరెస్ట్ చేశారు.

ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన మల్కాజ్‌గిరి కోర్టు ప్రధాన జిల్లా న్యాయమూర్తి, సోమవారం (జూన్ 8) నాడు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. భారత శిక్షాస్మృతి (IPC) లోని కఠినమైన సెక్షన్ల కింద మృతుడి కొడుకు (47), కూతురు (36)లకు మరణశిక్ష ఖరారు చేశారు. అలాగే, ఈ కుట్రలో భాగస్వామి అయిన వృద్ధుడి భార్య (65)కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

ధనం, ఆస్తిపై ఉన్న దురాశ మనుషుల కళ్లను ఎంతగా కప్పేసిందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. కన్నతండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన పిల్లలే, కేవలం పెన్షన్ డబ్బుల కోసం నరరూప రాక్షసులుగా మారిన ఈ ఉదంతంపై కోర్టు ఇచ్చిన తీర్పు సమాజానికి ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us