హైదరాబాద్‌లో మరోసారి గంజాయి గుప్పుమంది. కేజీ.. రెండు కేజీలు కాదు.. క్వింటా.. రెండు క్వింటాలు కాదు.. షాకయ్యే రేంజ్‌లో పట్టుబడింది. ఏకంగా 800 కిలోల గంజాయి దొరకడంతో కలకలం రేపింది. అయితే.. ఈ గంజాయి ముఠాను సినిమా లెవల్లో ఛేజ్ చేసి పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇంతకీ.. ఈ గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు?.. దీని వెనుక ఎవరున్నారు? భారీగా గంజాయి పట్టుబడడంపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి వెలుగులోకి వస్తుండడంతో స్మగ్లర్లపై డేగ కన్నేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. భారీ కంటైనర్‌లో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఏకంగా.. 800 కేజీల గంజాయి దొరకడం కలకలం రేపింది. దీని విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు.
శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండలో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర వాహనాలు తనిఖీల్లో ఈ గంజాయి బయటపడింది. గంజాయి ముఠా ఒడిశా నుంచి మహారాష్ట్ర, కర్నాటకకు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అరకు ప్రాంతానికి చెందిన రాము, సోమ్‌నాథ్ కారా, సురేష్ పాటిల్ ప్రధాన నిందితులని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆరుగురిని అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని ఎస్‌వోటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇక.. సినిమా స్టయిల్లో ఈ బ్యాచ్.. గంజాయిని తరలించినట్లు గుర్తించామని చెప్పారు.
గంజాయిని స్మగ్లర్స్ చాలా తెలివిగా సప్లయ్ చేస్తున్నారని ఎస్‌వోటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. దాంతో.. పట్టుబడ్డ నిందితుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఒడిశా నుంచి ఈ గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు?.. దీని వెనక ఎవరున్నారు?.. అనే అంశాలపై ఫోకస్ పెట్టామన్నారు. అయితే.. ప్రధాన రిసీవర్ దొరికితే మరిన్ని వివరాలు లభిస్తాయని.. ఈ కేసులో సీరియస్‌గా విచారణ జరుగుతుందని చెప్పారు డీసీపీ శ్రీనివాస్.
బలిమెలకు చెందిన సోమనాథ్ అనే వ్యక్తి కమిషన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ ట్రాన్స్‌పోర్టర్‌గా ఉంటున్నాడు. అయితే గంజాయి ట్రాన్స్‌పోర్ట్ చేసినందుకు సోమనాథ్ ప్రతి ట్రాన్స్‌ఫోర్ట్‌కు మూడు లక్షలు తీసుకుంటాడు. ఈ కేసు లో మహారాష్ట్ర కు చెందిన రిసీవర్ గా మారుతి పటేల్ అనే వ్యక్తి ఉన్నాడు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు పోలీసుల చెప్తున్నారు. అతన్ని త్వరలోనే పట్టుకుంటామని బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
పోలీస్ నిగా తప్పించుకోవడానికి కంటైనర్ ముందు నిందితులు కార్ లో ఎస్కార్ట్ గా వస్తారు… కంటైనర్ కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి ఎక్కడైనా పోలీసుల తనిఖీలు ఉంటే అప్రమత్తం చేస్తారు…పోలీసుల నిఘానుండే తప్పించుకోవడానికి టోల్గేట్ వద్దకు కంటైనర్ రాంగానే వాహనం నంబర్ ప్లేట్ మారుస్తారు..నిందితులపై అనుమానంతో 15 నుండి 25 రోజులు వరకు ఈ కేసు పై వర్కౌట్ చేసారు పోలీసులు..
నిందితులు ఒరిస్సా నుండి గంజాయి తీసుకువచ్చి పటాన్‌చెరు వద్ద మరొక వెహికల్‌లోకి గంజాయిని మార్చారు. మార్చిన ఆ వెహికల్ లో గంజాయిని మహారాష్ట్రకు తీసుకుని వెళ్తున్నారని పోలీసులు తెలిపారు.. విఠల్ రెడ్డి పరవాడ సెజ్ లో సాల్వెంట్ డ్రమ్ములను కంటైనర్ లోడ్ చేసుకున్నారు. కంటైనర్ ముందు భాగంలో సాల్వెంట్ డ్రమ్స్ పెట్టి వెనకాల భాగంలో గంజాయి ఉంచారు. కెమికల్స్ డ్రమ్ములను కూడా జీఎస్టి వే బిల్లు లేకుండా తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఆ కెమికల్ సాల్వెంట్స్ ఏంటి అన్న అంశంపై కూడా పోలీసలుు విచారణ చేపట్టారు.
వాస్తవానికి.. తెలంగాణ పోలీసులు గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ముప్పేట దాడులు చేస్తుండడంతో హైదరాబాద్ పోలీసుల వ్యూహాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రధానంగా.. ఏపీ పోలీసుల సహకారంతో గంజాయికి అడ్డుకట్ట వేసేందుకు దాడులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని చెక్‌పోస్టులు దాటి ఒడిశా నుంచి హైదరాబాద్ దాకా ఈ గంజాయి కంటైనర్ ఎలా వచ్చిందనే అంశం కీలకంగా మారింది. ఇంత పోలీసుల నిఘా మధ్య ఇన్ని వందల కిలోమీటర్లు గంజాయిని కంటైనర్‌లో ఎలా తరలించారు అనేది చర్చనీయాంశం అవుతోంది.
మరిన్ని