
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ కవచ్’ పేరిట హైదరాబాద్ సిటీ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, వాహనాల నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ విధమైన ట్యాంపరింగ్ నేరగాళ్లకు సులభంగా తప్పించుకునే మార్గంగా మారడమే కాకుండా, అమాయకులను తప్పుడు ఈ-చలాన్లు, కేసుల గుప్పిట్లోకి నెడుతూ శాంతిభద్రతలకు తీవ్ర సవాల్‌గా పరిణమిస్తోంది. ఈ ముప్పును అరికట్టడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కీలక ప్రాంతాన్ని ఎంచుకుని, లా అండ్ ఆర్డర్ సిబ్బంది రోడ్లపై ఉండి ఈ తనిఖీలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్-వెంకటగిరి, మధురానగర్-కృష్ణకాంత్ పార్క్, బోరబండ-పిలీ దర్గా, సనత్‌నగర్, అమీర్‌పేట్-సత్యం థియేటర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్స్‌ను సీపీ సజ్జనార్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో తనిఖీల సరళిని పరిశీలించిన ఆయన, స్వయంగా కొన్ని వాహనాలను ఆపి నంబర్ ప్లేట్లను నిశితంగా పరిశీలించారు. నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనదారులతో నేరుగా మాట్లాడి, నిబంధనలు పాటించకపోవడానికి గల కారణాలను ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు కలిగి ఉండటం ఎంత ముఖ్యమో వారికి వివరించారు. అనంతరం, ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు.
ఎక్కువ మంది చదివినవి: కొంప ముంచావ్ కదరా చిట్టి.. బాలుడిని కడుపులో తన్నేసిన రోబో.. ఇదిగో వీడియో
ఈ ఆపరేషన్‌లో భాగంగా నగరవ్యాప్తంగా వివిధ జోన్లలో కలిపి మొత్తం 12,098 వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇందులో 8,802 ద్విచక్ర వాహనాలు, 1,693 నాలుగు చక్రాల వాహనాలు, 1,623 ఆటోలు ఉన్నాయి. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఉన్న 1,406 వాహనాలను, అసలు నంబర్ ప్లేట్ లేని 1,132 వాహనాలను, నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 69 వాహనాలను పోలీసులు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను మొత్తం 2,149 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2,046 ద్విచక్ర వాహనాలు, 52 ఫోర్ వీలర్స్, 51 ఆటోలు ఉన్నాయి.
జోన్ల వారీగా చూస్తే.. గరిష్టంగా రాజేంద్రనగర్ జోన్‌లో 2,376, సికింద్రాబాద్ జోన్‌లో 2,230, చార్మినార్ జోన్‌లో 2,171 వాహనాలను తనిఖీ చేయగా, స్వాధీనం చేసుకున్న వాటిలో అత్యధికంగా గోల్కొండ జోన్ పరిధిలో 530, చార్మినార్ జోన్ పరిధిలో 444 వాహనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. నగర ప్రజల రక్షణ కోసం ఆపరేషన్ కవచ్ ను చేపట్టినట్లు చెప్పారు. నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌ను కేవలం సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా పరిగణించబోమని స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా మార్చడం లేదా అస్పష్టంగా ఉంచడం సమాజ భద్రతకే పెను ముప్పు అని పేర్కొన్నారు. నేరస్థులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్లను వంచడం, అక్షరాలను చెరిపేయడం లేదా నకిలీ నంబర్లను వాడుతుంటారని తెలిపారు.
దీనివల్ల అమాయక వాహనదారులకు తప్పుడు ఈ-చలాన్లు వెళ్లడమే కాకుండా, కొన్నిసార్లు వారు క్లిష్టమైన కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌కు పాల్పడే వారిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ, రవాణా శాఖ నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లను స్పష్టంగా ఉంచుకోవాలని వాహనదారులకు సూచించారు. వాహనాలతో బయటకు వచ్చేటప్పుడు సంబంధిత ధ్రువపత్రాలను వెంటనే ఉంచుకోవాలన్నారు. ప్రస్తుతం ఆపరేషన్ కవచ్ లో భాగంగా టూ వీలర్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టామని.. రాబోయే రోజుల్లో అన్ని రకాల వాహనాలపై దశల వారీగా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఎక్కువమంది చదివినవి: ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. మీకు నచ్చిన చోటే 400 చదరపు అడుగుల విశాలమైన ఇళ్లు!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.