హనుమంతుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? సువర్చలా కల్యాణం వెనుక అసలు రహస్యం!

27 June 2026

Rajashekher

శ్రీ ఆంజనేయస్వామి పుట్టుకతోనే యజ్ఞోపవీతం ధరించిన ఆజన్మ బ్రహ్మచారి. అయినప్పటికీ లోకకల్యాణం కోసం ప్రత్యేక పరిస్థితుల్లో సువర్చలాదేవిని వివాహం చేసుకున్నట్లు పరాశర సంహిత పేర్కొంటుంది.

పరాశర సంహిత ప్రకారం జ్యేష్ఠ మాసం శుద్ధ దశమి రోజున శ్రీ హనుమంతుడు, సువర్చలాదేవి వివాహం జరిగింది. ఈ సందర్భంగా అనేక హనుమాన్ ఆలయాల్లో కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు.

విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించినప్పుడు వెలువడిన దివ్య కాంతి నుంచి సువర్చలాదేవి ఆవిర్భవించింది. ఆమెను చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారని పురాణ కథనం చెబుతుంది.

సువర్చలాదేవిని వివాహం చేసుకోవాలని ఇంద్రుడు కోరగా, బ్రహ్మదేవుడు శివాంశ సంభూతుడైన హనుమంతుడే ఆమెకు యోగ్యుడని ప్రకటించాడు.

సూర్యదేవుని వద్ద విద్య పూర్తిచేసిన హనుమంతుడు గురుదక్షిణ అడగగా, తన కుమార్తె సువర్చలాదేవిని వివాహం చేసుకోవడమే గురుదక్షిణగా కోరాడు.

తాను బ్రహ్మచర్య దీక్షలో ఉన్నానని, వివాహం చేసుకోలేనని హనుమంతుడు వినయంగా చెప్పాడు. దీనికి సూర్యుడు ఈ వివాహం బ్రహ్మచర్యానికి భంగం కలిగించదని వివరించాడు.

సువర్చలాదేవి దైవాంశ సంభూతురాలు కావడంతో ఈ వివాహం కేవలం జగత్ కల్యాణం కోసమే జరిగిందని, హనుమంతుడు ప్రాజాపత్య బ్రహ్మచారిగానే కొనసాగుతాడని సూర్యుడు వరమిచ్చాడు.

పరాశర సంహితలోని మరో కథనం ప్రకారం, సూర్యుని వద్ద నవ వ్యాకరణాలలో చివరి వ్యాకరణం అభ్యసించడానికి వివాహితుడై ఉండాల్సిన నియమం ఉండటంతో సువర్చలాదేవితో వివాహం జరిగింది.

సువర్చలాదేవి భౌతిక శరీరం లేని తేజోరూపిణి కావడంతో ఈ వివాహం ఆధ్యాత్మికమైనదిగా భావించబడింది. అందువల్ల ఈనాటికీ శ్రీ ఆంజనేయస్వామి ఘోటక బ్రహ్మచారిగానే భక్తులచే పూజలందుకుంటున్నాడు.