మాంజా మాటున మరణమృదంగం.. తాట తీస్తున్న నగర పోలీసులు.. జర భద్రం..!

ఆకాశంలో ఎగరేసే గాలిపటాలకు ఆధారం దారమేగా? ఆ దారపు ఉండల్నే మాంజాలంటాం. కానీ, ఇవాళా రేపు మనం వాడే పాపులర్ మాంజాలన్నీ మేడిన్ చైనా..! ఎందుకంటే ఇవి మహా పదునైనవి, చచ్చినా తెగవు. చుట్టుకుంటే మన దుంపలే తెగుతాయ్. ఎగరేసినవాళ్లు సేఫే. దారిన పోయే దానయ్యలే బలి. చైనీస్ మాంజాతో మృత్యుఘంటికలు మోగడం మొదలైంది.

మాంజా మాటున మరణమృదంగం.. తాట తీస్తున్న నగర పోలీసులు.. జర భద్రం..!
Chinese Manja

Edited By:

Updated on: Jan 13, 2026 | 7:30 AM

చిలుకా, నెమలీ, మైనా అని మనం ముద్దుపేర్లు పెట్టుకుని ఆకాశంలో ఎగరేసే గాలిపటాలకు ఆధారం దారమేగా? ఆ దారపు ఉండల్నే మాంజాలంటాం. కానీ, ఇవాళా రేపు మనం వాడే పాపులర్ మాంజాలన్నీ మేడిన్ చైనా..! ఎందుకంటే ఇవి మహా పదునైనవి, చచ్చినా తెగవు. చుట్టుకుంటే మన దుంపలే తెగుతాయ్. ఎగరేసినవాళ్లు సేఫే. దారిన పోయే దానయ్యలే బలి. ఔను, చైనీస్ మాంజాతో మృత్యుఘంటికలు మోగడం మొదలైంది. ఈ నాలుగు రోజులూ బైటికెళ్లాలంటేనే భయపడిపోతున్నారు జనం. ఎటునుంచి ఏ మాంజా వచ్చి మెడకు చుట్టుకుంటుందో అని బెంబేలు.

పీకలు కోస్తున్నావు.. ఉసురు తీస్తున్నావు.. అంతా నువ్వే చేశావు అంటూ అందరూ ఆ చైనీస్ మాంజానే కొరకొరా చూస్తున్నారు. నిజానికి, మన మాంజాలు కూడా మామూలుగా లేవు ఇప్పుడు. దారం కాని దారంతో తయారు చేస్తూ, చైనీస్ మాంజాస్‌కు దీటుగా అమ్ముడు అతున్న లోకల్ మాంజాలూ ప్రాణాలు తీస్తున్నాయి. వీటి అంతు తేల్చేపనిలో పడ్డారు పోలీసులు. సంక్రాంతి సందడి మాటున ప్రాణాల మీదకు తెస్తోన్న చైనా మాంజా విషయంలో హైదరాబాద్‌ పోలీసులు సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటున్నారు. షాపులపై ఆకస్మిక దాడులు చేసి ఉక్కుపాదం మోపుతున్నారు. యమపాశాల్లాంటి చైనా మాంజాను విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. హెచ్చరికలతో మాట వినని వారి భరతం పడుతున్నారు.

హైదరాబాద్‌లోని పాతబస్తీలో 200 మంది పోలీసులతో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నంబర్ ప్లేట్లు సరిగా లేని 130 వాహనాలను సీజ్ చేశారు. రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులపై జీరో టాలరెన్స్ విధానం అమలులో ఉందని డిసిపి కిరణ్ కారే స్పష్టం చేశారు. గాలిపటాల షాపుల్లో కూడా తనిఖీలు చేశారు. పతంగులను ఎగురవేసే సమయంలో మాంజాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.. లేదంటే అవి కోసుకుపోయి ఒక్కోసారి మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఇంతటి ప్రాణాంతకమైన మాంజాల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు చార్మినార్ డివిజన్ డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్. ఎంతో మంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో చైనా మాంజా వల్ల పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని చార్మినార్ డివిజన్ డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ తన సొంత డబ్బులతో చైనా మాంజా సేఫ్టీ రాడ్స్ ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. పాతబస్తీ ప్రాంతంలోని పలు ప్రధాన రహదారుల్లో వాహనదారులకు వందలాది రాడ్స్ పంపిణీ చేస్తూ మాంజాల వల్ల జరిగే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మార్కెట్లలో విరివిగా దొరికే మాంజాలు ఎక్కువ శాతం చైనా నుంచి దిగుమతి అయినవే ఉంటున్నాయి.. ఈ చైనా మాంజాలు చాలా ప్రమాదకరం. ఈ నేపథ్యంలో చైనీస్ మాంజాలపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరవ్యాప్తంగా అనేక షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఎక్కడైనా చైనా మాంజాలు విక్రయిస్తున్నట్లయితే వాటిని సీజ్ చేసి వ్యాపారులను హెచ్చరిస్తున్నారు. చైనా మాంజాల వినియోగంపై, అరికట్టే చర్యలపై ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ సీపీ సజ్జనర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండగా.. చైనా మాంజాల వల్ల ప్రజలే కాదు పదుల సంఖ్యలో పక్షులు కూడా మృత్యువాతపడుతున్నాయి. చైనా మాంజాలకు చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి ఎన్నో రకాల పక్షులు స్తంభాలకు వేలాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ.. పతంగుల షాపుల్లో పోలీసులు పదేపదే దాడులు చేస్తున్నప్పటికీ గుల్జార్ హౌస్, ధూల్‌పేట్‌ పరిసర ప్రాంతాల్లో చైనా మాంజాలు అమ్ముతున్న కేసులు తాజాగా వెలుగులోకి వచ్చింది. చైనా మాంజాలను అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే అని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెద్దఎత్తున తనిఖీలు చేపడతామని.. చైనా మాంజాలు ఎక్కడైనా పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని పాతబస్తీ పోలీసులు ఇదివరకే హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఈ క్రమంలో చార్మినార్ డివిజన్ డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ ప్రజలకు చైనా మాంజా ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ, వాహనదారులకు తన సొంత డబ్బులతో చైనా మాంజా సేఫ్టీ రాడ్స్ పంపిణీ చేస్తున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీసీపీ కిరణ్ తీసుకున్న చొరవ పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..