పైసల కోసం మీ అకౌంట్ డీటేల్స్ ఇచ్చేస్తే.. మీరు క్రైమ్‌లో పార్టనర్ అయినట్లే.. !

ఉన్నట్టుండి మీ స్నేహితుడి నుంచో.. లేదా పరిచయమైన వ్యక్తి నుంచో ఫోన్ కాల్ వస్తుంది. 'అర్జెంట్‌గా బ్యాంక్ అకౌంట్ నంబర్ కావాలి.. ఎక్కడో నుంచి డబ్బు రావాలి.. కమీషన్ కూడా ఇస్తాం' అనే మాటలతో ఆశ చూపిస్తారు. ఆఫర్ బాగానే ఉందనిపిస్తుంది. ఏమీ చేయాల్సిన పని లేదు.. అకౌంట్ డీటైల్స్ ఇవ్వడమే. అక్కడితో కథ ముగిసిందనుకుంటారు. కానీ.. అక్కడినుంచే మొదలవుతుంది సైబర్ నేరస్తుల ఆట.

పైసల కోసం మీ అకౌంట్ డీటేల్స్ ఇచ్చేస్తే.. మీరు క్రైమ్‌లో పార్టనర్ అయినట్లే.. !
Hyderabad City Police Commissioner V.c. Sajjanar, Rbi Deputy Governor Swaminathan

Edited By:

Updated on: Dec 22, 2025 | 1:42 PM

ఉన్నట్టుండి మీ స్నేహితుడి నుంచో.. లేదా పరిచయమైన వ్యక్తి నుంచో ఫోన్ కాల్ వస్తుంది. ‘అర్జెంట్‌గా బ్యాంక్ అకౌంట్ నంబర్ కావాలి.. ఎక్కడో నుంచి డబ్బు రావాలి.. కమీషన్ కూడా ఇస్తాం’ అనే మాటలతో ఆశ చూపిస్తారు. ఆఫర్ బాగానే ఉందనిపిస్తుంది. ఏమీ చేయాల్సిన పని లేదు.. అకౌంట్ డీటైల్స్ ఇవ్వడమే. అక్కడితో కథ ముగిసిందనుకుంటారు. కానీ.. అక్కడినుంచే మొదలవుతుంది సైబర్ నేరస్తుల ఆట.

మీ అకౌంట్‌లో భారీగా డబ్బు జమ అవుతుంది. ఇంత డబ్బెక్కడి నుంచి వచ్చిందా అని ఆలోచించేలోపే.. నిమిషాల్లోనే ఆ డబ్బంతా విత్‌డ్రా అయిపోతుంది. మళ్లీ మరోసారి.. ఇంకోసారి.. వాళ్లకు అవసరమైన ప్రతీసారీ మీ అకౌంట్‌ను వాడేస్తారు. మీకు తెలియకుండానే.. మీ బ్యాంక్ ఖాతా సైబర్ నేరాలకు వేదికగా మారుతుంది. మీరు నేరం చేయకపోయినా.. నేరంలో భాగస్వాములవుతారు. ఇలాంటి ఖాతాలనే మ్యూల్ అకౌంట్లు అంటారు.

ఒక్క సైబర్ దోపిడీ జరిగిన వెంటనే బాధితుడి ఖాతాలోని డబ్బు నేరుగా నేరస్తుల అకౌంట్‌కు వెళ్లదు. ముందుగా చేరేది.. మ్యూల్ అకౌంట్‌లోకి..! ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు ప్రధాన ఆయుధంగా మారింది. సైబర్ నేరం జరిగిన క్షణాల్లోనే నగదును మ్యూల్ అకౌంట్లకు మళ్లించి, అక్కడి నుంచి గంటల్లోనే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసి, చివరికి వేరే దేశాల్లో నగదుగా విత్‌డ్రా చేస్తున్నారు నేరగాళ్లు. ఈ మొత్తం ప్రక్రియ అంత వేగంగా జరుగుతుంది కాబట్టి పోలీసులు ట్రేస్ చేసేలోపే డబ్బు మాయమవుతోంది.

కేసుల ఛేదనలో పోలీసులకు మ్యూల్ అకౌంట్లే అతిపెద్ద సవాలుగా మారాయి.. ఇదే సైబర్ నేరస్తుల ఎత్తుగడ. ట్రేస్ కాకుండా ఉండేందుకు వేసే ప్లాన్. విద్యార్థులు.. రోజువారీ కూలీలు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారే టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు కొన్నిసార్లు కొత్తగా అకౌంట్లను కూడా క్రియేట్ చేయిస్తున్నారు. రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు కమీషన్ ఆశ చూపించి.. వారి పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరిపిస్తారు. ఇంతటితో ఆగడం లేదు.. ఒకటి.. అర శాతం కమీషన్ కోసం కొంతమంది బ్యాంక్ సిబ్బంది కూడా సైబర్ నేరస్తులతో చేతులు కలుపుతున్నారనే అనుమానాలు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ మ్యూల్ అకౌంట్లే.. సైబర్ నేరాలకు ఆక్సిజన్ అంటూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా గవర్నర్‌ను కలిసి మ్యూల్ అకౌంట్లపై మూడు కీలక నివేదికలను అందజేశారు. మ్యూల్ అకౌంట్లకు చెక్ పెట్టే కీలక చర్యలు ప్రతిపాదించారు.

అందులో ప్రధానమైదని.. దేశవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ డేటాబేస్. అంటే అన్ని బ్యాంకులు, పోలీస్ శాఖలు ఒకే ప్లాట్‌ఫామ్‌లో మ్యూల్ అకౌంట్ల సమాచారాన్ని పంచుకునే విధానం. అదే విధంగా మ్యూల్ హంటర్ టూల్‌ డెవలప్ చేయడం. ఇది అనుమానాస్పద లావాదేవీలు, ఫాస్ట్ ట్రాన్స్‌ఫర్లను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. అలానే బ్యాంకింగ్ సంస్థలు.. ఖాతా తెరిచే సమయంలో నిబంధనల కఠినతరం చేయాలి. పూర్తి స్థాయి KYC వెరిఫికేషన్ తప్పనిసరి చేసి.. ఆ ఖాతాదారుడు ఆ ప్రాంతంలో ఫిజికల్‌గా ఉన్నాడా లేదా పక్కాగా రూడీ చేసుకోవాలి. ఇంకా జియో వెరిఫికేషన్ + లైవ్ వీడియో KYC తప్పనిసరి చేయాలి. నకిలీ గుర్తింపులకు, డమ్మీ అకౌంట్లకు పూర్తిస్థాయి బ్రేక్ వేయాలి. ఇవి అమలైతేనే సైబర్ నేరాల్లో డబ్బు రికవరీ సాధ్యమవుతుందని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల మాటల్లో చెప్పాలంటే.. మ్యూల్ అకౌంట్లే సైబర్ నేరాలకు ఆక్సిజన్. వాటిని అడ్డుకోగలిగితేనే సైబర్ నేరాల గొలుసు తెగిపోతుంది.

దేశవ్యాప్తంగా మ్యూల్ అకౌంట్ల ముప్పు ఈ చర్చ ఇప్పుడు ఎందుకు మొదలైంది అంటే.. సీబీఐ విడుదల చేసిన డేటానే కారణం. దేశవ్యాప్తంగా 700 బ్యాంక్ శాఖల్లో 8.5 లక్షల మ్యూల్ అకౌంట్లను గుర్తించారు. ఇన్ని మ్యూల్ అకౌంట్స్ ఏర్పడ్డాయి అంటే సైబర్ నేరగాళ్ల సంఖ్య ఎంత పెరిగిపోయిందో.. నేరాల తీవ్రత ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. కమీషన్ కోసం అకౌంట్ ఇవ్వడం చిన్న తప్పు కాదు.. చట్టపరమైన నేరం. మీ అకౌంట్.. మీ గుర్తింపు.. మీ భవిష్యత్తు. ఒక్క కాల్‌తో సైబర్ నేరస్తుల చేతిలో పడిపోకుండా జాగ్రత్త పడటమే ఇప్పుడు మీకు అసలైన సేఫ్టీ సజీషన్..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..