
హైదరాబాద్ నగర శివారు ఫామ్ హౌస్‌లలో మత్తెక్కించే పెద్ద పెద్ద ఈవెంట్లు డైలీ జోరుగా జరుగుతున్నాయి. మొయినాబాద్, చేవెళ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లలో వందలాది ఫాంహౌజ్ లు ఉన్నాయి. పేరొందిన రిసార్ట్స్ లు ఉన్నాయి. చిన్నపాటి బర్త్ డే ఫంక్షన్ అయినా ఫాంహౌజ్ లు డిజే చప్పుళ్లతో దద్దరిల్లిపోతున్నాయి. కలర్ ఫుల్ లైటింగ్స్ .. అమ్మాయిల డ్యాన్స్ లు… ఆపై మద్యం కిక్కుతో పార్టీలు, ఫంక్షన్లతో ఫాంహౌజ్ లు, రిసార్ట్స్ లు మెరిసిపోతున్నాయి. తాజాగా వీటికి తోడు కోళ్ల పందాలు, గ్యాంబ్లింగ్ గేమ్స్ ఎంటర్ అయ్యాయి. బెట్టింగ్ రాయుళ్లు ఫాంహౌజ్ లను లీజుకు తీసుకుని మరీ వికృత కార్యాలకు నిలయంగా మార్చేస్తున్నారు. ఫన్ హబ్ గా ఉన్న మొయినాబాద్ ను క్రైమ్ జోన్ గా మారిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇవన్నీ లోకల్ పోలీసులకు తెలియడం లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ యేడాది స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ 39 ఫాంహౌజ్ లపై దాడులు నిర్వహించింది. ఫాంహౌజ్ లో కోళ్ల పందాలు నడుపుతున్న సంఘటనలు రెండుసార్లు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టిన తర్వాత.. మళ్లీ మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడటంతో వీరి వెనక ఎవరున్నారనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తోల్కట్టలోని ఓ ఎమ్మెల్సీకి సంబంధించిన ఫాంహౌజ్‌ను లీజ్‌కు తీసుకుని కోళ్ల పందాలు నిర్వహించారు కొందరు బెట్టింగ్ రాయుళ్లు. బాకారంలో ఓ ఫాంహౌజ్ ను చంద్రశేఖర్ లీజుకు తీసుకుని కోళ్ల పందాలు నిర్వహించారు. బాకారంలో ఎస్ కే ఫాంహౌజ్‌లో యుగాండ, ఆఫ్రికా తదితర దేశాలకు చెందిన 51 మంది డ్రగ్స్ పార్టీ నిర్వహించారు.
SOT బృందం దాడులు చేసి వారిని పట్టుకుంది. చిన్నమంగళారంలోని చెర్రీఒక్స్ ఫాంహౌజ్ లో 50 మంది యువత డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ పట్టుబడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఇన్ని జరుగుతున్నా SOT బృందం దాడులు చేసే వరకు లోకల్ పోలీసులకు నిజంగా తెలియడం లేదా ? తెలిసినా ఇవేమీ కనిపించనట్లు నటిస్తున్నారా ? అన్న దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ముజ్రా పార్టీలు.. రేవ్ పార్టీలు.. ట్రాప్ హౌస్ పార్టీలు పేర్లు ఏదైనా అక్కడ జరిగేది మాత్రం విందులు., చిందులే. వీటికి తోడు బెట్టింగ్ రాయుళ్లు ఫాంహౌజ్ లను అడ్డాలుగా మార్చుకుని దందాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి కేవలం 40 నిమిషాల దూరంలో ఉన్న మొయినాబాద్ ప్రాంతంలో నైట్ లైఫ్ కల్చర్ వికృత పోకడలకు దారితీస్తోంది.
ఇకనైనా ఫామ్ హౌస్ కార్యకలాపాలపై ప్రత్యేక డ్రైవ్ చేపడతారా ? లోకల్ పోలీస్ పర్యవేక్షణలో ఎలాంటి మార్పులు చేస్తారు ? మోయినాబాద్ ప్రాంతం ‘రేవ్ జోన్’గా మారకుండా సైబారాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. డిసెంబర్ 31 నైట్ కు ఇప్పటి నుంచే ఫాంహౌజ్ లు, రిసార్ట్స్ లు స్పెషల్ పార్టీలకు రెడీ చేస్తున్నారు. పోలీసుల యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.