Hyderabad Liberation Day: భారత్‌లో హైదరాబాద్ విలీన చరిత్ర.. 1948కి ముందు అసలేం జరిగిందంటే.. పిన్ టు పిన్ విశేషాలు మీకోసం..
Hyderabad Liberation Day: దేశ విభజనకు పూర్వం అంటే 1947కు ముందు ఇండియా రెండు భౌగోళిక ప్రాంతాలుగా ఉండేది. ఒక భాగం వైస్రాయ్ అధీనంలో..
Hyderabad Liberation Day: దేశ విభజనకు పూర్వం అంటే 1947కు ముందు ఇండియా రెండు భౌగోళిక ప్రాంతాలుగా ఉండేది. ఒక భాగం వైస్రాయ్ అధీనంలో ఉన్న ప్రాంతం. దానికి బ్రిటీష్ ఇండియా అని పేరు. మరొకటి మహారాజులు, రాజులు, నవాబుల అధీనంలో ఉన్న భూభాగం. అలాంటి రాజ్యాలు, సంస్థానాలు భారతదేశంలో నాడు 562 ఉండేవి. వీటిలో 327 చిన్న రాజ్యాలు .
బ్రిటీష్ ఇండియా స్వతంత్ర దేశంగా మారుతుందని 1947, ఫిబ్రవరి 20న బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన రాజ్యాలు కొత్తగా ఏర్పడే రెండు దేశాల్లో ఏదో ఒకదానిలో చేరాలని 1947 జులై 25న జరిగిన సమావేశంలో వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ సూచించారు. చాలా రాజ్యాలు దానికి సమ్మతించాయి. అయితే, అప్పట్లో పెద్ద రాజ్యాలుగా ఉన్న కశ్మీర్, హైదరాబాద్, జునాఘడ్ విలీనం ఒప్పందంపై 1947, ఆగస్టు 15న సంతకం చేయలేదు. పాకిస్తాన్ సైన్యం చొరబడటంతో 1947, అక్టోబర్ 26న ఇండియాలో విలీనమయ్యేందుకు ఒప్పందంపై కశ్మీర్ మహారాజు సంతకం చేశారు. కానీ హైదరాబాద్ నిజామ్ మాత్రం ససేమిరా అన్నారు. తన రాజ్యం ప్రత్యేక దేశంగా ఉండాలని ఆకాంక్షించారు.
భౌగోళికంగా ఆ రెండు దేశాల కన్నా పెద్దది..
నాడు హైదరాబాద్ రాజ్యం భౌగోళికంగా చాలా పెద్ద ప్రాంతం. తెలంగాణలోని హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు, మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతంలో భాగంగా ఉన్న ఔరంగబాద్, నాందేడ్, బీడ్, ఉస్మానాబాద్, బీదర్, పర్బని జిల్లాలు, కర్నాటకలోని గుల్బర్గ, రాయచూర్ జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో భాగం. 16 జిల్లాలతో 82,698 చదరపు మైళ్లు విస్తీర్ణంతో కూడిన విశాలమైన రాజ్యం హైదరాబాద్. ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్ రెండింటిని కలిపిన దానికన్నా కూడా ఎక్కువ భూభూగం. నాటి రాజ్యంలో తెలుగువారు 48.2 శాతం, మరాఠీలు 26.4 శాతం, కన్నడిగులు 12.3 శాతం, ఉర్దూ మాట్లాడే జనాభా 10.3 శాతం ఉండేది. హైదరాబాద్ రాజ్య జనాభా నాడు ఇంచుమించు ఒక కోటి 63 లక్షలు.
పెత్తనం అంతా వారిదే..
హిందూవుల జనాభా ఎక్కువున్నప్పటికీ సైన్యం, పోలీసులు, పరిపాలన వ్యవస్థలో పెత్తనమంతా ముస్లింలదే. నిజామ్ నవాబుకు సొంతంగా కరెన్సీ, పోస్టేజ్, స్టాంపులే కాదు సొంత రైల్వే, రవాణా వ్యవస్థ, ఎయిర్‌పోర్టు ఉన్నాయి. హైదరాబాద్ రాజ్యానికి సొంతంగా సాయుధ బలగాలూ ఉండేవి. బొగ్గు, ఇనుము సహ అనేక ఖనిజాల పుష్కలంగా ఉండటంతో ఆ రోజుల్లోనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అపారమైన సంపద కలిగిన నవాబును చుట్టుపక్కల ఉండే సామంతులుు, జాగీర్దార్లు రెచ్చగొట్టి హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించేలా చేశారు. ఇండియా అంతటా 1947, ఆగస్టు 15న త్రివర్ణ పతాకం రెపరెపలాడితే, తన రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న నిజాం పసుపు రంగు ఆసఫ్‌జాహీ జెండాను ఎగరవేశారు.
జిన్నా ప్రభావంతో పాకిస్తాన్‌లో చేర్చాలని..
దేశ విభజన తథ్యమని తేలడంతో జిన్నా ప్రభావంతో హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో చేర్చాలని భావించారు అప్పటి నిజాం. భౌగోళికంగా అది సాధ్యం కాదని తేలడంతో స్వతంత్ర రాజ్యంగా హైదరాబాద్ సంస్థానం ఉండాలని ఆకాంక్షించారు. బ్రిటీషర్లతో తనకున్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా వారిని ఒప్పించడం పెద్ద పనేం కాదని నిజాం భావించారు. కానీ, దీనికి బ్రిటీషర్లు అంగీకరించలేదు. అంతే కాదు దేశనడిబొడ్డున హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉండటం భారతదేశ ఉదరంలో క్యాన్సర్ వంటిదని సర్దార్ వల్లభాయ్ పటేల్ గట్టిగా వాదించేవారు.
పటేల్ దృష్టిలో నిజాం చర్యలు..
ఈ క్రమంలో తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రజాకార్ సైన్యాన్ని సృష్టించారు. దీనికి అధిపతి ఖాసిం రజ్వి. అత్యంత కిరాతకుడనే పేరుంది. ఇండియాకు స్వాతంత్ర్యం రాకముందే నుంచే హైదరాబాద్ రాజ్యంలో ఆరాచకం సృష్టించారు రజ్వి నేతృత్వంలోని రజాకార్లు. మహిళలపై అత్యాచారాలు. హిందువులను చంపడం, ఆలయాలను దోచుకోవడం నిత్యకృత్యంగా మారింది. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి కాందీశికులు హైదరాబాద్ రాజ్యానికి రావడం పెరిగిపోయింది. తన ప్లాన్ సక్సెస్ అయినట్టేనని నిజాం భావిస్తున్న వేళ ఈ ఆరాచకాలను భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీవ్రంగా పరిగణించారు.
ఎవరికీ ఇవ్వని ఆఫర్లు ఇచ్చారు.. అయినప్పటికీ..
పాకిస్థాన్‌తో నిజాం అంటకాగకుండా చూసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్, లార్డ్ మౌంట్‌బాటెన్, KM మున్షీ ఆయనతో చర్చలు జరిపారు. మిగిలిన సంస్థానాధీశులు ఎవరికీ ఇవ్వని అనేక ఆఫర్లు అందించారు. జూన్ 1948లో అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్‌బాటెన్ హెడ్స్ ఆఫ్ అగ్రిమెంట్ సిద్ధం చేశారు. అందులో భాగంగా భారతదేశంలో స్వతంత్ర ప్రాంతంగా హైదరాబాద్‌కు హోదా కల్పించారు. అలాగే హైదరాబాద్ రాజ్య సైనిక దళాలతో పాటు రజాకార్ల వ్యవస్థను తొలగించాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ రాజ్యానికి అధిపతిగా నిజామ్ నవాబు కొనసాగేటట్టు, రాజ్యాంగ సభ ఏర్పాటు చేసేందుకు సాధారణ ఎన్నికలతో పాటు ప్లెబిసైట్ నిర్వహించాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ రాజ్యాన్ని హైదరాబాద్ ప్రభుత్వమే పరిపాలిస్తుందని, విదేశీ వ్యవహారాలను మాత్రమే భారత ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆ ఒప్పందంలో పొందుపరచడం జరిగింది. హైదరాబాద్ రాజ్యం పాకిస్థాన్‌లో భాగం కాకుండా చూసేందుకు అనేక మంది భారతీయ నాయకులు ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపి సంతకం చేశారు. అయితే, ఈ ఒప్పందాన్ని నిజాం నవాబ్ తిరస్కరించారు. తమకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వాలని లేదా బ్రిటీష్ కామన్‌వెల్త్‌లో సభ్య దేశంగా తమను చూడాలని డిమాండ్ చేశారు.
ఆ భయంతోనే రజాకార్ల సంస్థ ఏర్పాటు..
ఇండియా – హైదరాబాద్ మధ్య చర్చలు జరుగుతున్న వేళ విభజన కారణంగా దేశంలో గందరగోళ పరిస్థితి తీవ్రమైంది. హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు పెరిగాయి. తన రాజ్యంలోనూ తిరుగుబాటు తలెత్తుతుందనే భయంతో తన సన్నిహిత సలహాదారుడు, మజ్లిస్ పార్టీ అధినేత ఖాసిం రజ్వితో రజాకార్లు అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటుకు నిజామ్ అనుమతించారు. ఉర్దూ పదం రజాకార్ అంటే వాలంటీర్ అని అర్థం. ఈ రజాకార్లు తెలంగాణలో సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. రజాకార్లు హిందువులకు మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. దాదాపు 150 గ్రామాల్లో హింస చెలరేగింది. ఇందులో 70 గ్రామాలు భారతదేశంలో భాగం.
పటేల్‌కు విజ్ఞప్తుల వెల్లువ..
నిజామ్ సైన్యంలో కిరాయి బలగాలను నియమించుకునే సంప్రదాయం ఉండేది. అరబ్బులు, రొహిల్లాలు, ఉత్తర భారత ముస్లింలు, పఠాన్లు ఇందులో భాగం. మొత్తంగా 22 వేల మంది రజాకార్లకు అరబ్ అధికారి మేజర్ జనరల్ ఎల్ ఇద్రూస్ కమాండర్. రజాకార్ల ఆకృత్యాలు తీవ్ర రూపం దాల్చడంతో చాలా మంది తెలంగాణవాసులు హైదరాబాద్‌పై దాడి చేయాలని అప్పటి భారతదేశ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కోరారు. కాని మహాత్మా గాంధీ ససేమిరా అన్నారు. దీంతో కొన్నాళ్ల పాటు హైదరాబాద్ రాజ్యంలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై భారత్ మౌనంగా ఉండిపోయింది.
‘ఆపరేషన్ పోలో’ స్టార్ట్..
నిజామ్ రాజ్యంలో అకృత్యాలు పెరగడం, కమ్యూనిస్టు సాయుధ పోరాటం తీవ్ర రూపం దాల్చడంతో హైదరాబాద్ రాజ్యంపై సెప్టెంబర్ 13, 1948న సైనిక చర్యను భారత సైన్యం ప్రారంభించింది. దీనికి అప్పటి ప్రధాని నెహ్రూ అయిష్టంగానే అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ చర్యకు ఆపరేషన్ పోలో అనే పేరు పెట్టారు. హైదరాబాద్ రాజ్యాన్ని నాలుగు వైపుల నుంచి భారత సైన్యం చుట్టుముట్టింది. షోలాపూర్, ఔరంగాబాద్, బెజవాడ, ఆదిలాబాద్ నుంచి సైన్యం హైదరాబాద్ రాజ్యం వైపు కదలింది. ఈ సైనిక చర్య కోసం భారత ప్రభుత్వం అప్పట్లో కేవలం 35 వేల మంది సైనికులను మాత్రమే పంపింది. ఐదు రోజులు జరిగిన ఆ యుద్ధంలో భారత సైన్యంలో 35 మంది మాత్రమే చనిపోయారు. అదే 2.20 లక్షల సైన్యంతో కూడిన హైదరాబాద్ రాజ్యంలో 5,738 మంది హతమయ్యారు.
పరిస్థితులు చేజారడంతో లొంగుబాటు నిర్ణయం..
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం, అటు భారత్ సైన్యం తన రాజ్యంలోకి ప్రవేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరిస్తూ భారత హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం నవాబు సెప్టెంబర్ 17, 1948న సరెండరయ్యారు. దాంతో హైదరాబాద్ రాజ్యం భారత దేశంలో భాగమైపోయింది.
మజ్లిస్ బాధ్యతలు ఆయనకు అప్పగించి..
1948 నుంచి 1957 వరకు రజాకార్ల నేత ఖాసిం రజ్వి జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత అతను పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందారు. మజ్లిస్ బాధ్యతలను అబ్దుల్ వాహెద్ ఒవైసీకి రజ్వీ అప్పగించారు. 1948లో కొంత కాలం పాటు మజ్లిస్‌ను నిషేధించారు. ఆ తర్వాత అది తన పేరును ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమిన్‌గా మార్చుకుంది. అప్పటి నుంచి నేటికీ ఆ పార్టీ కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..