Hyderabad: రియల్ ఎస్టేట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. రాయదుర్గంలో ఎకరం రూ.264 కోట్లు!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో భూముల ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. TGIIC వేలంలో రాయదుర్గంలో ఒక ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో, ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న భూములకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తుంది. వాణిజ్య, కార్యాలయ అభివృద్ధికి ఈ ప్రాంతం అత్యంత ఆకర్షణీయంగా మారింది, గత రికార్డులను అధిగమించింది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరోసారి భూముల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన భూముల ఆన్‌లైన్ వేలంలో రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ మేరకు TGIIC ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన భూముల వేలంలో ఇది మరో రికార్డుగా నిలిచింది.
రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లో పాన్‌మక్తా ప్రాంతానికి చెందిన మొత్తం 5.25 ఎకరాల భూమిని TGIIC ఆన్‌లైన్ వేలానికి పెట్టింది. ఈ భూమికి ఎకరాకు కనీస ధరను రూ.175 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. వేలంలో పాల్గొనే బిడ్డర్లకు రూ.10 కోట్ల డిపాజిట్ మొత్తాన్ని నిర్దేశించారు. భారీ విలువ కలిగిన భూమి కావడంతో పలు రియల్ ఎస్టేట్ సంస్థలు వేలంలో పోటీపడి బిడ్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వేలంలో ఎకరం భూమికి రూ.264 కోట్ల వరకు బిడ్ వెళ్లడంతో రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ లెక్కన 5.25 ఎకరాల మొత్తం భూమి విలువ కూడా భారీ స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. TGIIC భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదే ప్రాంతంలో మూడు నెలల క్రితం నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ.237 కోట్ల ధర పలికినట్లు సమాచారం. తాజాగా ఆ రికార్డును అధిగమిస్తూ రూ.264 కోట్ల ధర నమోదవడం హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ డిమాండ్‌కు సంకేతంగా మారింది.
ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న రాయదుర్గం, పాన్‌మక్తా ప్రాంతాల్లో వాణిజ్య, కార్యాలయ, మిశ్రమ వినియోగ అభివృద్ధికి భారీ డిమాండ్ ఉండటమే ఈ స్థాయి ధరలకు కారణంగా రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి. TGIIC భూముల వేలంలో నమోదైన తాజా రికార్డు ధరతో హైదరాబాద్ భూముల మార్కెట్‌లో మరోసారి చర్చ మొదలైంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
