AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌కు ఎంతంటే?

IRCTC Goa Tour Package Telugu: గోవా అందాలను ఆస్వాదించాలనుకునే హైదరాబాద్ వాసులకు IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. 4 రోజులు, 3 రాత్రుల ఈ ‘గోవా డిలైట్’ ప్యాకేజీలో విమాన ప్రయాణం, 4 స్టార్ హోటల్ వసతి, భోజనం, స్థానిక సందర్శనలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ 2026 ప్యాకేజీ ధరలు, ప్రయాణ షెడ్యూల్, సందర్శించే ప్రదేశాల వివరాలు తెలుసుకోండి.

IRCTC గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌కు ఎంతంటే?
Irctc Goa Tour Package
Rajashekher G
|

Updated on: Aug 21, 2026 | 4:42 PM

Share

IRCTC Goa Tour Package Telugu: సముద్ర తీరాలు, చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, సందడి చేసే పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి అందాలతో గోవా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో సందర్శించే గోవాను మరింత సులభంగా చుట్టి రావడానికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ‘గోవా డిలైట్’ (SHA03) పేరుతో రూపొందించిన ఈ ప్యాకేజీలో హైదరాబాద్‌ నుంచి విమాన ప్రయాణం, గోవాలో 3 రాత్రుల వసతి, అల్పాహారం, రాత్రి భోజనం, స్థానిక రవాణా, ప్రముఖ పర్యాటక ప్రదేశాల సందర్శన వంటి సదుపాయాలు ఉన్నాయి.

ప్యాకేజీ వివరాలు

  • ప్యాకేజీ పేరు: గోవా డిలైట్
  • ప్యాకేజీ కోడ్: SHA03
  • ప్రయాణ విధానం: విమానం
  • ప్రారంభ స్థానం: హైదరాబాద్ విమానాశ్రయం
  • వసతి: గోవాలో 4 స్టార్ హోటల్
  • వ్యవధి: 4 రోజులు / 3 రాత్రులు
  • భోజనం: 3 బ్రేక్‌ఫాస్ట్‌లు, 3 డిన్నర్లు
  • హోటల్: Neelams The Grand, Goa

పర్యటన తేదీలు

ఈ ప్యాకేజీ 2026 ఆగస్టు 26, 2026 సెప్టెంబర్ 9 తేదీల్లో అందుబాటులో ఉంది.

ఆగస్టు ప్రయాణం

ఆగస్టు 26న హైదరాబాద్‌ నుంచి 11:45 గంటలకు 6E 905 విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1:05 గంటలకు గోవా విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆగస్టు 29న సాయంత్రం 5:20 గంటలకు 6E 117 విమానంలో గోవా నుంచి బయలుదేరి సాయంత్రం 6:35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

సెప్టెంబర్ ప్రయాణం

సెప్టెంబర్ 9న హైదరాబాద్‌ నుంచి 11:45 గంటలకు 6E 905 విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1:05 గంటలకు గోవా చేరుకుంటారు. సెప్టెంబర్ 12న మధ్యాహ్నం 1:40 గంటలకు 6E 712 విమానంలో గోవా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:05 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

ప్యాకేజీ ధరలు

ఆగస్టు 2026:

  • సింగిల్ ఆక్యుపెన్సీ – ₹26,950
  • డబుల్ ఆక్యుపెన్సీ – ₹21,500
  • ట్రిపుల్ ఆక్యుపెన్సీ – ₹21,000
  • చైల్డ్ విత్ బెడ్ (2–11 ఏళ్లు) – ₹17,800
  • చైల్డ్ వితౌట్ బెడ్ (2–11 ఏళ్లు) – ₹17,800
  • చిన్నారి (2–4 ఏళ్ల లోపు) – ₹13,600

సెప్టెంబర్ 2026:

  • సింగిల్ ఆక్యుపెన్సీ – ₹24,640
  • డబుల్ ఆక్యుపెన్సీ – ₹19,200
  • ట్రిపుల్ ఆక్యుపెన్సీ – ₹18,680
  • చైల్డ్ విత్ బెడ్ (2–11 ఏళ్లు) – ₹15,520
  • చైల్డ్ వితౌట్ బెడ్ (2–11 ఏళ్లు) – ₹15,520
  • చిన్నారి (2–4 ఏళ్ల లోపు) – ₹9,130

మొదటి రోజు – హైదరాబాద్ నుంచి గోవా: హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానంలో గోవా చేరుకున్న అనంతరం విమానాశ్రయం నుంచి హోటల్‌కు బదిలీ చేస్తారు. హోటల్‌లో చెక్-ఇన్ అనంతరం సాయంత్రం స్థానిక మార్కెట్‌ను సందర్శించేందుకు సమయం ఉంటుంది. రాత్రి భోజనం, గోవాలో బస.

రెండో రోజు – దక్షిణ గోవా: అల్పాహారం అనంతరం దక్షిణ గోవా సందర్శన ప్రారంభమవుతుంది. ఓల్డ్ గోవాలోని బసిలికా ఆఫ్ బామ్ జీసస్, ఆర్కియాలజికల్ మ్యూజియం, పోర్ట్రెయిట్ గ్యాలరీ, వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషి ఆలయం, మిరామార్ బీచ్ వంటి ప్రదేశాలను సందర్శిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మండోవి నదిలో బోట్ క్రూయిజ్ ఉంటుంది. అనంతరం హోటల్‌కు తిరిగి వచ్చి రాత్రి భోజనం, బస.

మూడో రోజు – ఉత్తర గోవా: అల్పాహారం తర్వాత ఉత్తర గోవా టూర్‌కు బయలుదేరుతారు. ఫోర్ట్ అగ్వాడా, కాండోలిమ్ బీచ్, బాగా బీచ్, అంజునా బీచ్, వాగటార్ బీచ్, చపోరా ఫోర్ట్‌లను సందర్శిస్తారు. బాగా బీచ్ వద్ద వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలకు అవకాశం ఉంటుంది. అయితే వాటికి అదనపు చార్జీలు ఉంటాయి. రాత్రికి హోటల్‌లో బస.

నాలుగో రోజు – గోవా నుంచి హైదరాబాద్: అల్పాహారం అనంతరం ఉదయం 10 గంటలకు హోటల్ నుంచి చెక్‌అవుట్ చేయాలి. అనంతరం గోవా విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణ విమానం ఎక్కుతారు.

ప్యాకేజీలో ఏమేం ఉన్నాయి?

ఈ ప్యాకేజీలో హైదరాబాద్–గోవా–హైదరాబాద్ రౌండ్ ట్రిప్ విమాన టికెట్లు, గోవాలో 3 రాత్రుల ఏసీ 4 స్టార్ హోటల్ వసతి, 3 బ్రేక్‌ఫాస్ట్‌లు, 3 డిన్నర్లు, ఏసీ కోచ్‌లో షేరింగ్ ప్రాతిపదికన స్థానిక రవాణా, షెడ్యూల్ ప్రకారం సందర్శనా కార్యక్రమాలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, IRCTC ఎస్కార్ట్ సేవలు, వర్తించే పన్నులు ఉన్నాయి.

అదనపు ఖర్చులు

హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు, అక్కడి నుంచి తిరిగి రావడానికి రవాణా ప్యాకేజీలో లేదు. లంచ్, విమానంలో భోజనం, వాటర్ స్పోర్ట్స్, మండోవి రివర్ బోట్ క్రూయిజ్, గైడ్ సేవలు వంటి వాటికి అదనపు చార్జీలు వర్తిస్తాయి. డ్రైవర్లు, గైడ్లు, ప్రతినిధులకు ఇచ్చే టిప్స్, వ్యక్తిగత ఖర్చులు, లాండ్రీ, మినరల్ వాటర్, మద్యం తదితర వ్యక్తిగత అవసరాల ఖర్చులు కూడా ప్యాకేజీలో ఉండవు. విమాన చార్జీలు, ఎయిర్‌పోర్ట్ ట్యాక్స్, ఇంధన సర్‌చార్జ్ తదితరాల్లో పెరుగుదల ఉంటే అదనపు మొత్తం చెల్లించాల్సి రావచ్చు.

గోవా వెళ్లాలనుకునేవారికి మంచి అవకాశం

సముద్ర తీరాల అందాలతో పాటు చరిత్ర, సంస్కృతి, ఆలయాలు, బీచ్‌లు, నదీ విహారం వంటి విభిన్న అనుభవాలను ఒకే పర్యటనలో ఆస్వాదించాలనుకునే వారికి ఈ ‘గోవా డిలైట్’ ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం 19 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ప్యాకేజీ వివరాల్లో పేర్కొన్నారు.

గమనిక: పై ప్రయాణ ప్రణాళికను IRCTC గతంలో నిర్వహించిన టూర్ల ఆధారంగా ప్రతిపాదిత/సూచనాత్మక షెడ్యూల్‌గా పేర్కొంది. విమాన సమయాలు, హోటల్, ఇతర ఏర్పాట్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. బుకింగ్‌కు ముందు తాజా వివరాలను IRCTC అధికారిక సమాచారంతో నిర్ధారించుకోవడం మంచిది.

ఐఆర్ సీటీసీ గోవా డిలైట్ టూర్ ప్యాకేజీ టికెట్ బుకింగ్, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us