ఇలాంటి మతపరమైన అంశాలపై రీల్స్ చేశారో.. ఇక జైలుకే! తస్మాత్ జాగ్రత్త
రంజాన్‌లో హైదరాబాద్‌లోని హలీం స్టాల్ వద్ద చిత్రీకరించిన ఒక రీల్ వీడియో ముస్లిం సమాజంలో వివాదాన్ని రేకెత్తించింది. ఈ వీడియోలో ఖవ్వాలీ వాయిస్తూ హలీం తయారీ చూపించడం ముస్లింల మతపరమైన భావాలను దెబ్బతీసిందని ఆరోపణలు. పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.

రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లిం సోదరుల ప్రార్థనలు, ఉపవాసాలు, పర్వదినాలతో పాటు మరో ప్రత్యేకత కూడా ఉంటుంది. సీజన్ మొదలైందంటే ఎక్కడ చూసినా, ఏ హోటల్ ముందు చూసినా హలీం అమ్మకాలు పెద్దఎత్తున జరుగుతుంటాయి. రోడ్లపై జనం ఎగబడి మరీ హలీం లొట్టలేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రధానంగా హైదరాబాద్ లాంటి ప్రముఖ నగరంలో హలీం సందడి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న హలీం విషయంలో ఇప్పుడు ఓ వివాదం మొదలైంది. పైగా ఇది లక్షలాది మంది ముస్లిం సోదరుల మతపరమైన భావాలను కించపరించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలేం జరిగింది.. ఎందుకు ఈ వివాదం మొదలైందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పవిత్ర రంజాన్ మాసం నడుస్తున్న నేపథ్యంలో హలీం తయారుచేయడం సాధారణమే. కానీ, ఇలాంటి పవిత్ర మాసంలో ఓ యువకుడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఒక రీల్‌ను పోస్ట్ చేశాడు. హైదరాబాద్‌లోని షహాలిబండలోని యాసీన్ ఫంక్షన్ హాల్ సమీపంలోని హలీమ్ స్టాల్ వద్ద ఆ వీడియోను తీసినట్లుగా తెలుస్తోంది. అమ్మకాలు పెద్దఎత్తున పెరిగిపోవాలనే ఉద్దేశ్యంతో హలీమ్ సిద్ధం చేస్తున్న సమయంలో ఆ యువకుడు ఖవ్వాలీ వాయిస్తూ ఆ వీడియో రికార్డు చేశాడు. ఇప్పుడు ఇది ముస్లిం సమాజంలోని చాలా మంది సభ్యుల మతపరమైన భావాలను తీవ్రంగా గాయపరిచినట్లుగా చెబుతున్నారు.
ఇందుకు సంబంధించిన రీల్స్ కంటెంట్ సున్నితంగా ఉండటమే కాకుండా, సమాజంలో చెడు దారులను తొక్కే దిశగా ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవిత్ర మాసంలో ఉండే నమ్మకాలను అగౌరవపరిచే అవకాశం కూడా ఉందని మత పెద్దలు, పలు ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటువంటి ప్రవర్తన విభిన్న మత సమూహాల మధ్య గౌరవం, అవగాహన విలువలను దెబ్బతీస్తుందని.. సామాజిక విభేదాలకు దారితీస్తుందని.. ఇలాంటి అసంఘటిత చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరుతున్నారు.
అయితే.. ఈ తతంగంపై హైదరాబాద్ నగరం బహదూర్‌పురాకు చెందిన మొహమ్మద్ అహ్మద్ జలీల్ అనే వ్యక్తి శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి మతపరమైన విశ్వాసాలను కించపరిచే వ్యక్తులకు తగిన శిక్ష పడాల్సిన అవసరం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు FIR నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి కంటెంట్ సృష్టికర్తలు వాళ్లు రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో చేసే పోస్టుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఎంతో మందిని ప్రభావితం చేసేలా ఈ సోషల్ మీడియా పోస్టులు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ముఖ్యంగా ఇలాంటి మతపరమైన, సున్నితమైన అంశాల్లో ఎదుటివాళ్ల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వివాదం రేపిన వీడియోలో వ్యక్తి ఫుర్ఖాన్ ముస్లిం సమాజం క్వాద్రీ శాఖను ఉద్దేశపూర్వకంగా అవమానించే పాటతో రీల్‌ను చిత్రీకరించాడని గుర్తించామన్నారు. ఇది క్వాద్రీ శాఖ, దర్గా కార్యకలాపాల విశ్వాసాలను అవమానించేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఫిర్యాదుదారుడి విజ్ఞప్తి మేరకు ఈ చర్యకు పాల్పడిన యువకుడిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.