బంధుబలగం అందరూ ఉన్నా ఆదరించే దిక్కులేక ఓ విశ్రాంత ఉద్యోగి ఉరివేసుకొని బలమన్మరణానికి పాల్పడ్డాడు. మానవ సంబంధాలపై ఇటీవల విడుదలైన ‘బలగం’ సినిమాను తలపించేలా ఉన్న ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలో మంగళవారం (మే 9) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హయత్‌నగర్ మండలం మునగనూరుకు చెందిన మల్లెల మల్లేష్ (63) ఉస్మానియా ఆసుపత్రిలో అటెండర్‌గా పని చేసి ఇటీవల రిటైర్డ్ అయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంతానికి పెళ్లిళ్లు అయ్యి మనవలు మనవళ్లు కూడా పుట్టారు. ఐతే కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యతోసహా అందరూ ఎవరికి వారు తలో దారిలో వెళ్లిపోయారు. దీంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్లేష్ ఆదరించే వారు లేక నాగోల్ డివిజన్ ఆనంద్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం వంట చేసేందుకు వచ్చిన పని మనిషి మల్లేష్ తన బెడ్‌రూం ఉరివేసుకొని ఉండటం చూసి కెవ్వుకెవ్వున అరించింది. ఇరుగుపొరుగు వచ్చి అప్పటికే ఆయన మృతి చెందడాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎల్బీనగర్ ఎస్సై లింగారెడ్డి వివరాలు నమోదు చేసుకుని, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడంతో మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.