Hyderabad: ఒకరు నవమాసాలూ మోసిన కన్నతల్లి.. ఒకరు కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి.. సమాజం ఏమనుకుంటుందోనని బెంబేలెత్తి కొడుకుని ఇచ్చేసిన వాళ్ళొకరు.. ఎవరేమనుకున్నా పసిబిడ్డకి తల్లీదండ్రీ తామే అనుకుని కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కుటుంబం ఒకటి.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 14 ఏళ్ల క్రితం వివాహేతర సంబంధంతో పుట్టిన బిడ్డను వదిలించుకోవాలనుకున్న తండ్రి.. 14 ఏళ్ల తరువాత తన కొడుకుని తనకివ్వాలంటూ గొడవకు దిగాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
14 ఏళ్ల క్రితం తన బిడ్డను ఎవరికైనా ఇచ్చేయాలని డిసైడ్ అయిన కొండల్ నాయక్.. తన స్నేహితుడిని కోరాడు. పిల్లల కోసం తల్లడిల్లుతోన్న స్నేహితుడి జంటకు రెండు నెలల పసిగుడ్డుని అప్పగించారు కొండల్, శారద దంపతులు. పెద్దల సమక్షంలో ఊరు ఊరందరి ముందు పసిబిడ్డని పొదివిపట్టుకుని ఇంటికి చేర్చుకున్నారు రాజేష్, రమణమ్మ దంపతులు. పొత్తిళ్ళలో బిడ్డని అపురూపంగా పెంచుకున్న రాజేష్, రమణమ్మలు తమ కొడుకుని తిరిగి పంపేయాల్సిన రోజొస్తుందని ఊహించలేకపోయారు. హఠాత్తుగా తన బిడ్డని తమకిచ్చేయాలంటూ కోర్టుకెళ్ళడంతో ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న తల్లి కొడుకు కోసం గుండెలవిసేలా రోదిస్తోంది.
బిడ్డ మైనర్ కావడంతో కన్నవారికి బిడ్డని అప్పగించేందుకు సీడబ్ల్యుసీ సిద్ధమవడంతో పెంచిన తల్లిదండ్రులు లబోదిబో మంటున్నారు. పధ్నాలుగేళ్ళల్లో ఏనాడూ కానరాని కన్నతల్లిదండ్రులు ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. తన కొడుకుని తనకిచ్చేయాలంటూ పట్టుపడుతున్నారు. కాదంటే కోర్టులోనే తేల్చుకుంటామంటూ తెగేసి చెపుతున్నారు. పసిగుడ్డుగా ఉన్నప్పుడు కన్నపేగును తెంచుకున్నారు.. కాదనుకున్న కొడుకు ఇప్పుడెందుకు కావాల్సొచ్చాడు ఇదే ఇప్పుడు సమాధానం లేని ప్రశ్న. ఇదిలాఉంటే.. తానెప్పుడూ తన కన్నతల్లిని చూడనేలేదంటున్నాడు బాబు. తన తల్లీతండ్రీ రమణమ్మ, రాజేష్‌లేనని తేల్చి చెపుడుతున్నాడు. కానీ మైనర్ బాలుడిపై ఎవరికి హక్కుంటుంది? ఈ కథ కంచికి చేరేదెలా? 14ఏళ్ళుగా బాబుతో పెనవేసుకున్న బంధం ఏమౌతుంది? చట్టం ఏం తేలుస్తుందో చూడాలి.