AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?

చికెన్ షాప్‌ల వద్ద కాసేపు నిల్చుంటేనే.. వాటి వ్యర్థాల నుంచి వచ్చే కంపును బరించలేము.. కానీ అవే వ్యర్థాలు నేరుగా మీరు తినే ప్లేట్‌లోకి వస్తున్నాయంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. కాసులకు కక్కుర్తి పడిన కొందరు వ్యాపారు చేసే తప్పుడు దందా కారణంగా చెత్త కుప్పలో పడాల్సిన వ్యార్థాలు చేపల రూపంలో మీ కడుపులోకి వెళ్తున్నాయి. చికెన్ దుకాణాల నుంచి మొదలవుతున్న ఈ అక్రమ దందా ఇప్పుడు కోట్ల మంది ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి ఎలా నెడుతోందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Hyderabad: చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?
Hyderabad Chicken Waste Racket
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Aug 24, 2026 | 8:16 PM

Share

హైదరాబాద్‌లో చికెన్‌ తింటున్నారా..? అయితే ఆ చికెన్‌ షాపులో మిగిలిపోయిన వ్యర్థాలు ఎక్కడికి వెళ్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? కోళ్ల తలలు, పేగులు, కాళ్లు, చర్మం, ఈకలు, మనకు కనిపించకుండా రాత్రికి రాత్రే లారీల్లో తరలిపోతున్నాయి. చెత్తగా పారేయాల్సిన ఈ వ్యర్థాలను కొందరు మాఫియా వ్యాపారంగా మార్చేశారు. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువులకు తరలించి.. చేపలకు మేతగా వేస్తున్నారు. అంటే మనం చెత్తగా భావించే చికెన్‌ వ్యర్థాలే.. రేపు మనం తినే చేపకు ఆహారంగా మారుతున్నాయి.

చికెన్‌ దుకాణాల్లో మిగిలే వ్యర్థాలను నేరుగా వినియోగించకూడదు. నిబంధనల ప్రకారం వాటిని రెండరింగ్‌ కేంద్రాలకు తరలించాలి. అక్కడ వ్యర్థాల్లో కలిసిన ప్లాస్టిక్‌, ఈకలు వంటి వాటిని వేరు చేసి, శుద్ధి చేసి అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాదకర సూక్ష్మజీవులను నియంత్రించి. తదుపరి వినియోగానికి అనువైన పదార్థంగా మారుస్తారు. కానీ అక్రమ వ్యాపారులు మాత్రం ఈ రూల్స్ అన్నీ తుంగలో తొక్కుతున్నారు. చికెన్‌ షాప్స్ నుంచి నేరుగా వ్యర్థాలను సేకరిస్తున్నారు. రాత్రి వేళల్లో లారీల్లో తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తున్నారు. అక్కడ ఈ పచ్చి వ్యర్థాలనే చేపలకు మేతగా వేస్తున్నారు.

అసలు ప్రమాదం ఇక్కడే మొదలవుతోంది. పచ్చి చికెన్‌ వ్యర్థాలు బయట ఎక్కువసేపు ఉంటే కుళ్లిపోతాయి. దాంతో బ్యాక్టీరియా, ఇతర ప్రమాదకర సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యర్థాలను ఎలాంటి శుద్ధి లేకుండా చేపలకు ఆహారంగా వేస్తే.. వాటిలోని హానికర పదార్థాలు చేపల్లోకి చేరే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అక్కడితో కథ ముగియదు. ఆ చేపలను మనమే తింటాం. అంటే.. చికెన్‌ దుకాణంలో చెత్తగా మొదలైనది.. చేపల చెరువులో మేతగా మారి.. చివరకు మన భోజనం పళ్లెంలోకి వచ్చే ప్రమాదం ఉందన్నమాట.

ఇదే విషయంపై హెచ్‌-ఫాస్ట్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శుద్ధి చేయని, కుళ్లిపోయిన కోళ్ల వ్యర్థాలను చేపలకు మేతగా వేయడం వల్ల ప్రమాదకర సూక్ష్మజీవులు, హానికర పదార్థాలు మన ఫుడ్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి కలుషిత ఆహారం లాంగ్ టర్మ్ ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని.. క్యాన్సర్‌ ముప్పుపైనా ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక ఈ అక్రమ దందాపై సైబరాబాద్‌ పోలీసులు, వెటర్నరీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్‌, మియాపూర్‌, అమీన్పూర్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్‌ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి. లారీల్లో తరలిస్తున్న చికెన్‌ వ్యర్థాలను పట్టుకున్నారు. గత నెలలోనే సుమారు వంద టన్నుల చికెన్‌ వ్యర్థాలను స్వాధీనం చేసుకుని రెండరింగ్‌ కేంద్రానికి తరలించారు. తాజాగా మరోసారి భారీగా వ్యర్థాలను పట్టుకున్నారు. గతంలో కేసులు నమోదైనా ఈ మాఫియా మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

చీకటి పడితే లారీలు కదులుతున్నాయి.. నగరంలోని చికెన్‌ దుకాణాల నుంచి వ్యర్థాలు సేకరించి గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. చేపల చెరువులకు చేరుస్తున్నారు. చివరకు అదే చేపలు మన మార్కెట్లకు వస్తున్నాయా అన్న ప్రశ్న ఇప్పుడు కలకలం రేపుతోంది. మనకు కనిపించేది మార్కెట్‌లో మెరిసే చేప మాత్రమే.. కానీ ఆ చేప పెరిగిన చెరువులో ఏం వేశారు..? ఏం తినిపించారు..? ఆహారంగా మన ప్లేట్లోకి వచ్చే ముందు అది ఎక్కడి నుంచి వచ్చింది..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపైనే కాదు.. ఈ దందాను నిర్వహిస్తున్న వారిపైనా ఉంది.

చికెన్‌ వ్యర్థాలు చెత్తలా కనిపించొచ్చు.. కానీ అవి నేరుగా మన ఆహారంలోకి చేరితే మాత్రం అది కేవలం చెత్త సమస్య కాదు.. మన ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన సమస్య.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us