
ఆయన రాజీనామా పుణ్యమో ఏమో కానీ ఆ నియోజకవర్గానికి రాజయోగం పట్టింది. ప్రజలకు వరాలే కాదు.. ఆ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నాయకులకు పదవుల పంట పండుతుంది. ఎమ్మెల్యే టిక్కెట్టుతో మొదలు నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఇప్పుడు రాష్ట్రంలో హుజురాబాద్ హవా కొనసాగుతుంది. ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చింది అనే సామెతను రివర్స్ చేస్తూ ఇప్పుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా హుజూరాబాద్ నియోజకవర్గం పాలిట పండుగలా మారింది అంటున్నారు రాజకీయ నాయకులు. ఒక వైపు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు, దళిత బంధు పథకం ఇలా ఆక్కడి ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు అక్కడ చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రజలకే కాకుండా టీఆర్ఎస్ నేతలను నామినేటెడ్ పోస్టులు కూడా ఎక్కువగా వరిస్తోంది.
హుజూరాబాద్ లోకల్‌తో పాటు హుజురాబాద్ పరిసర నియోజకవర్గ నాయకులకు కూడా నామినేటెడ్ పదవులు వరిస్తుండటంతో ఇప్పుడు అక్కడి నాయకులు ఫుల్ జోష్ లో ఉన్నారట. ఈటల రాజేందర్ రాజీనామా తరువాత హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకున్నా.. అంతకు ఎక్కువ రేంజ్‌లో పోటాపోటీ ప్రచార కార్యక్రమాలు నడుస్తున్నాయి.. అయితే ఇదే సమయంలో గులాబీ అధిష్టానం అక్కడి నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తూ కొత్త ఉత్సాహం నింపుతోంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో మిగితా ఆశావహులకు కూడా నామినేటెడ్ పదవులు కేటాయిస్తూ అసంతృప్తి జ్వాలలను చల్లార్చుతున్నారని సమాచారం. ఇప్పటకి అయితే ఎస్సి కార్పొరేషన్ ఛైర్మన్‌గా బండ శ్రీనివాస్, బిసి కమిషన్‌గా చైర్మన్‌గా వకులబరణం కృష్ణ మోహన్, ఎమ్మెల్సీ గా కౌశిక్ రెడ్డికి అవకాశం కల్పించారు. హుజురాబాద్ పక్క నియోజకవర్గం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఛైర్మన్‌గా పదవులు ఇచ్చారు.
అటూ ఇన్నాళ్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడుగా ఉన్న ఈటల రాజేందర్ స్థానంలో మంత్రి హరీశ్ రావును అధ్యక్షుడుగా చేశారు.. దీంతో ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే లోపు హుజురాబాద్‌తో పాటు సమీప నియోజకవర్గ నేతలకు మరిన్ని పదవులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తుంది. నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక నిధులు, నేతలకు పదవుల వరదతో హుజూరాబాద్‌లో పార్టీ విజయాన్ని ఖాయం చేసుకోవాలన్నది టీఆర్ఎస్ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది.
Also Read..
కేంద్ర మంత్రికి పోలీసుల అరెస్ట్ వారెంట్.. మహారాష్ట్రలో రాజకీయ దుమారం
తాడు వేసి బిగించిందొకరు.. దిండుతో అదిమిపట్టిందొకరు.. రాహుల్ మర్డర్ కేసులో వీడుతున్న మిస్టరీ..