Huzurabad By Election: హుజురాబాద్ ఉప ఎన్నిక అసలు పోరు ఇవాళ్టితో మొదలైంది. మరోవైపు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు చేరుతోంది. ఈటల తనపై తాను దాడి చేయించుకుని సింపతీ కొట్టేసే కుట్ర చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్. మరోవైపు భాషపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రియల్ ఫైటింగ్ సీన్లతో హుజూరాబాద్ వేడెక్కింది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మరోస్థాయికి చేరింది. ఓ వైపు ప్రచారం అంతా కూడా సినిమా స్టైల్‌లో జరగబోతున్నట్లు కనిపిస్తోంది. ఫేక్ ఎటాక్‌లు. ప్రచారంలో చేతికి కట్లు. దాడి చేశారంటూ ఆరోపణలు ఇలా రకరకాల ఎత్తులు పైఎత్తులు.. మాటలదాకా అయితే వచ్చింది ఈటల రాజేందర్ భారీ కుట్రకు ప్లాన్ చేశారంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్ద బాంబే పేల్చారు. అక్టోబరు రెండోవారంలో సొంత మనుషులతోనే దాడి చేయించుకుని చేతికి కట్లు.. వీల్ చైయిర్‌తో ప్రచారానికి వస్తారంటూ జోస్యం చెప్పారు మంత్రి. పక్కా సమాచారంతోనే చెబుతున్నామంటున్నారు మినిస్టర్.
అటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సైతం ఇదే ఆరోపణలు చేశారు. తనపై అధికారపార్టీ దాడి చేసిందని.. ఊరూరా, ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుక్కుంటారని ఓటర్లు అలర్ట్‌గా ఉండాలంటున్నారు. గతంలో బండి సంజయ్ ఇలాంటి నాటకమే ఆడారని ఆయన ఆరోపణలు గుప్పించారు. దుబ్బాక బైపోల్‌లో రఘునందన్ రావు కట్లు కట్టుకుని తిరిగారు. ఇప్పుడు ఈటల కూడా సానుభూతి ప్రయత్నాలు మొదలు పెట్టారని అధికార పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు.
మరోవైపు. అధికార పార్టీ నేతల ఆరోపణలపై బీజేపీ నేత ఈటల రాజేందర్ గట్టిగానే రియాక్డ్ అయ్యారు. తనపై తానే దాడి చేయించుకుని సానుభూతి పొందాల్సిన అవసరం తనకు లేదంటున్నారు మాజీ మంత్రి ఈటల. కొత్తగా కట్టుకథలు అల్లుకుని వచ్చి ప్రచారం చేస్తుందే టీఆర్ఎస్ అన్నారు. హుజూరాబాద్ ప్రజల మద్దతు పూర్తిగా బీజేపీకే ఉంటుందన్నారు. తప్పుడు మాటలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఈటల.
అంతకుముందు జులై20న తనపై దాడి చేసేందుకు రాష్ట్ర మంత్రి ఒకరు.. మాజీ మావోయిస్టుతో సుపారీ కుదుర్చుకున్నారంటూ ఈటల వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. దీనిపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్.. సీబీఐతో అయినా విచారణకు సిద్దమంటూ సవాల్ విసిరారు. తాజాగా కొప్పుల వ్యాఖ్యలతో మరోసారి దాడుల అంశం హుజూరాబాద్ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది.