BJP Praja Sangrama Yatra: హుజురాబాద్‌లో కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. హుస్నాబాద్‌లో జరిగిన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర తొలిదశ ముగింపు సభలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హుజురాబాద్ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని దుయ్యబట్టారు. గడిచిన 5 నెలలుగా హుజురాబాద్‌లో మద్యం ఏరులై పారుతోందని, కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్‌లో తనను ఓడించేందుకు ప్రగతి భవన్‌లో కూర్చుని కేసీఆర్ ఆదేశాలిస్తుంటే.. కొంతమంది ఆ ఆదేశాలను అమలు చేస్తున్నారంటూ పరోక్షంగా మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు.
అక్టోబర్ 30వ తేదీన హుజురాబాద్‌లో జరుగబోయే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మమే గెలుస్తుందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజానీకం అంతా తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. హుజురాబాద్‌లో 75% బీజేపీ కి, 25% టీఆర్ఎస్‌కు మాత్రమే గెలుపు అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెప్తుంటే… కేసీఆర్‌కి దిమ్మతిరుగుతోందని ఈటల వ్యాఖ్యానించారు. ఎన్ని ఫేక్ లెటర్స్ సృష్టించినా… అది వారికే తిప్పి కొడుతోందన్నారు. తనలాంటి బక్క పలుచని ఉద్యమకారుడిని కొట్టాలని చూస్తే అది జరిగే పనేనా అని అన్నారు. హుజురాబాద్ కురుక్షేత్రంలో గెలిచాక… 33 జిల్లాల కురుక్షేత్రమే ఉంటుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్‌లో అమలు చేస్తున్న ‘దళిత బంధు’ను.. రాష్ట్రంలోని 33 జిల్లాలకూ అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ను ఈటల డిమాండ్ చేశారు. అలాగే అన్ని కులాల్లోని పేదలకు ఈ పథకాన్ని అమలు చేయాలన్నారు. బీజేపీని గెలిపించేందుకు 33 జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
కాగా, ప్రజాసంగ్రామ యాత్రపై స్పందించిన ఆయన.. ఆగస్ట్ 28వ తేదీన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమై.. 36 రోజులపాటు కొనసాగి, హుస్నాబాద్ లో విజయవంతంగా ముగిసిందని, ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రతీ కార్యకర్తకు అభినందనలు తెలిపారు.
Also read:
Telangana Corona: తెలంగాణ వ్యాప్తంగా తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్త 201మందికి పాజిటివ్, ఒకరు మృతి
31 బంతుల్లో సెంచరీ.. 11 సిక్సర్లు, 8 ఫోర్లు.. బౌలర్లను ఊచకోత కోసిన ఈ బ్యాట్స్‌మెన్ ఎవరంటే..?