Huzurabad And Badvel By Election campaign: తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల వేడి క్లైమాక్స్‌కు చేరుకుంది. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ నియోజవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 30న పోలింగ్ నిర్వహణ నేపథ్యంలో 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపేయాల్సి ఉంది. అయితే.. హుజూరాబాద్‌లో బుధవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రచారం చేసుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతినివ్వగా.. బద్వేల్ లో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ప్రధాన పార్టీల నాయకులు మాటల తూటాలతో రాజకీయాలను వెడెక్కించారు. ఈ సాయంత్రం ప్రచారం పర్వం ముగియగానే.. ప్రలోభాల పర్వం మొదలుకానుంది.
టీఆర్‌ఎస్, బీజేపీ హోరాహోరీ..
ఈటల శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన నాటి నుంచి.. ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే.. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ప్రచారం చేస్తూ వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకొని గులాబీ పార్టీ గెలుపు కోసం మంత్రి హరీష్‌రావును రంగంలోకి దింపారు. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ వెంట గ్రామగ్రామాన తిరుగుతూ హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ కూడా ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. ఈటల గెలుపు కోసం పార్టీ అగ్రనేతలందరూ నియోజవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఈటల, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, విజయశాంతి తదితర నాయకులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న బల్మూరి వెంకట్ గెలుపుకోసం కాంగ్రెస్ నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 30న జరగనున్న ఉప ఎన్నికకు పార్టీలన్ని చేస్తున్న ప్రచారం చివరి దశకు చేరడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరి రోజు టీఆర్ఎస్ తరుపున మంత్రులు హరీష్ రావు, గంగుల, కొప్పుల ఈశ్వర్ తదితర ఎమ్మెల్యే ప్రచారం చేయనున్నారు. బీజేపీ తరుపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి.సంజయ్ తదితరులు ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ తరపున శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి ప్రచారం చేయనున్నారు.
బద్వేల్‌లో వైసీపీ, బీజేపీ..
బద్వేల్ ఉపఎన్నిక ప్రచారానికి కూడా నేటితో తెరపడనుంది. ప్రచార పర్వంలో అధికార వైసీసీ, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన అగ్ర నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాటల తూటాలతో వేడెక్కించారు. అధికార పార్టీ వైసీపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరుపున పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, తదితర నాయకులు ప్రచారం నిర్వహించారు. కాగా.. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీ చేయడం లేదు.
Also Read: