నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే కాలయముడై భార్యను కత్తితో పొడిచి కడ తేర్చాడు. అంతటితో ఆగకుండా తాను కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తాగుడుకు బానిసైన భర్త సైకో గా మారి గత కొంతకాలంగా భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. రాత్రి 2 గంటలకు భార్యతో గొడవపడి విచక్షణ కోల్పోయి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బిజినేపల్లి కి చెందిన అబ్దుల్ నబీ, అబ్దుల్ జాహిదాబేగంలు దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలలు సంతానం. అయితే భర్త అబ్దుల్ నబీ తాగుడుకు బానిసై సైకో గా మారాడు. గత కొంతకాలంగా భార్యను హింసిస్తూ చిత్ర వధకు గురి చేశాడు. అయితే రాత్రి రెండు గంటల ప్రాంతంలో నిద్రిస్తున్న భార్యను లేపి గొడవకు దిగాడు. విచక్షణ రహితంగా కొట్టాడు. ఇంట్లో ఉన్న కత్తితో భార్యను దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటనతో భయానికి గురైన అబ్దుల్ నబీ అదే కత్తితో గొంతు కోసుకోవడంతోపాటు కడుపులో పొడుచుకున్నాడు.
విషయం తెలుసుకున్న బాధితురాలు బంధువులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని, గాయాల పాలైన బాధితుడిని నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని మార్చరికి తరలించారు. ఈ సంఘటనపై మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..