High Tension in Bandi Sanjay Tour: తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన మరోసారి ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ శ్రేణులు మరోసారి బండి సంజయ్ పర్యటనను అడ్డుకునేందుకు యత్నించాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి సెంటర్‌లో ఈ రోజు ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పర్యటనలో భాగంగా బండి సంజయ్ ఆత్మకూర్(ఎస్) ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్‌కు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి జరిగింది. స్వాగతం పలికేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు, అక్కడే నిరసన తెలిపేందుకు వచ్చిన టీఆర్ఎస్ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
అంతకుముందు చివ్వెంలలో ఇదే పరిస్థితి తలెత్తగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆత్మకూరు (ఎస్)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
Also Read: