
Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. భాగ్యనగర ప్రజలు.. పల్లెబాట పడుతున్నారు. ఉద్యోగాలు, చదువు, పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చినవారంతా సంక్రాంతి పండగను సొంత ఊరిలో అయినవారి మధ్య జరుపుకోవడానికి సొంతూళ్లకు పయనమవుతున్నారు. సంక్రాంతి సెలవులతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఎన్‌హెచ్ 65పై వాహనాలు బారులు తీరాయి. కరోనా నేపథ్యంలో మళ్ళీ పలు సంస్థలు వర్క్ ఎట్ హోమ్ ఇవ్వడంతో పాటు విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించడంతో వాహనాల రద్దీ మరింత అధికమైంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ ఉండటం వల్ల వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి.
మరోవైపు ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో వాహనాలు నెమ్మదిగా కదలడంతో రద్దీ సాధారణంకంటే అధికంగా ఉంది. ఎన్‌హెచ్ 65పై వాహనాల రాకపోకలు భారీగా పెరగడంతో టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ట్యాక్స్ చెల్లింపు కేంద్రాలను అధికారులు పెంచారు. అయితే ఫాస్టాగ్‌లో నగదు చెల్లింపుతో టోల్‌ప్లాజాల వద్ద సాఫీగా రాకపోకలు సాగుతున్నాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఏపీఆర్టీసీ అదనపు చార్జీలను వసూలు చేస్తోండగా.. తెలంగాణలో ప్రత్యేక బస్సులకు ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయడంలేదని ఆర్టీసీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also: రమేష్ బాబు మృతికి సంతాపం వ్యక్తం చేసిన చిరు, చంద్రబాబు.. తదితరులు.. మరోవైపు అంతిమయాత్రకు ఏర్పాట్లు..