బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారినందున రాష్ట్రంలో భారీ వర్షాలు కురియనున్నట్లు తెలిపింది.
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, కామారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, వరంగల్, సిద్దిపేట తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అయితే అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపోర్లుతుండటంతో రక్షణ బృందాలను అప్రమత్తం చేసింది. అంతేకాదు.. మరో రెండు, మూడు గంటల్లో భారీ వర్షం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరమైతే తప్ప బయటకు ఎవ్వరు రావొద్దని హెచ్చరించింది. నగరంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తెలత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు.
అయితే తెలంగాణకు భారీ వర్ష సూచన చేయడంతో విద్యార్థులకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ ఉంది. ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల సెలవు గురించి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వర్షాలకు రోడ్లన్ని జలమయం అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ మ్యాన్‌హోల్స్ తెరుచుకుంటాయ తెలియని పరిస్థితి. దీంతో విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ససేమిరా అంటున్నారు. దీంతో సెలవులు ప్రకటించే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి