
అభివృద్ధి అంటూ జనాలు అడవులను నరికి వేస్తున్నారు. దీని వల్ల భూమ్మీద చెట్లు తగ్గిపోవడమే కాకుండా కాలుష్యం పెరుగుతుంది. గాలిలో ఆక్సీజన్ శాతం తగ్గుతుంది. ముఖ్యం వణ్యప్రాణులకు నివాసం లేకుండా పోతుంది. జనాలు చేస్తున్న ఈ అరాచకంతో నిలువనీడ లేక అడవుల్లో ఉండాల్సిన వణ్యప్రాణులు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఇలానే ఒక గ్రామంలోకి వచ్చిన కోతులు ఆహారం కోసం గుడి దగ్గర భక్తుల నుంచి టెంకాయలు తీసుకోవడం వంటివి చేస్తున్నాయి. అయితే వాటి ఆకలిని గుర్తించిన ఓ జంతు ప్రేమికుడు వాటి ఆకలి తీర్చేందుకు ఏదైన చేయాలని నిర్ణయించుకున్నాడు. తన సంపాదనలో కొంత బాగాన్ని వాటి ఆకలి తీర్చేందుకు ఖర్చు పెడుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. యాదగిరిగుట్టకు చెందిన మచ్చ నర్సింహ గౌడ్ స్థానికంగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజు అతను యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటాడు. ఈ క్రమంలో కోతులు ఆహారం కోసం భక్తులపై ఎగబడుతుండడాన్ని ఆయన గమనించాడు. ఎలాగైనా వానరుల ఆకలి, దప్పికలు తీర్చాలని నర్సింహ భావించాడు. ఇందుకోసం తన సంపాదనలో కొంత మొత్తాన్ని దైవంగా భావించే వానరుల కోసం వెచ్చించాలని నిర్ణయించాడు.
వారంలో మూడు సార్లు అరటి పండ్లను తన ద్విచక్ర వాహనంపై తీసుకొని యాదగిరిగుట్ట కొండ వద్దకు వెళ్తాడు. నర్సింహ పిలుపును గుర్తుపట్టి వానరాలు పరుగు పరుగున చేరుకొని, క్రమశిక్షణగా ఆయన ఇచ్చే అరటి పండ్లను తీసుకొని వెళ్లిపోతాయి. ఇలా నర్సింహ ఇచ్చే అరటి పల్లతో ఆ వానరాలు తమ ఆకలి తీర్చుకుంటున్నాయి. కోతులకే కాదు ఇంతకు ముందు కూడా ఇతను ఇతర మూగజీవాల ఆకలిదప్పులను తీర్చాడు. చీమలకు చక్కెర, పక్షులకు నూకలు, ఆవులకు గడ్డి వేయడం, ఎండాకాలంలో పశువులు, పక్షుల కోసం నీటితోట్లు ఏర్పాటు చేసి నీరు అందించేవాడు.
ప్రస్తుత యాంత్రిక జీవితంలో ఆస్తులు, అంతస్తులతో మానసిక రోగులుగా మారిపోతున్నామని.. నోరులేని మూగజీవాల ఆకలి దప్పులను తీర్చడం ఎంతో సంతృప్తినిస్తుందని నర్సింహ చెబుతున్నాడు. 30 ఏళ్లుగా దైవంగా భావించే వానరులు, వన్యప్రాణులకు సేవ చేస్తున్నానని ఆయన చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.