నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్.. ఈ స్టోరీ చదివితే కన్నీళ్లే..
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి పరీక్షలో ఓ చిన్నారి రాసిన సమాధానం ఉపాధ్యాయులను కంటతడి పెట్టించింది. “యాదాద్రి నరసింహస్వామి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఏం కోరుకుంటావు?” అన్న ప్రశ్నకు.. “నాకు మా నాన్న కావాలి” అంటూ జవాబిచ్చింది. రెండేళ్ల క్రితం తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారి సమాధానం అందరి మనసులను కదిలించింది.

దేవుడిని వరం అడగమంటే.. ఎవరైనా ఏం కోరుకుంటారు..? చదువులో మంచి మార్కులు రావాలని.. మంచి ఉద్యోగం రావాలని.. మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటారు.. కానీ.. ఓ చిన్నారికి మాత్రం దేవుడి దగ్గర కోరిక ఒక్కటే ఉంది. అది డబ్బు కాదు.. బొమ్మ కాదు.. చదువు కాదు. ఆ చిన్నారి కోరికను చూసిన ప్రతి ఒక్కరి మనసును కదిలించింది. ఆ చిన్నారి దేవుడిని ఏం కోరుకుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్ పల్లి ప్రాథమిక పాఠశాలలో ఇటీవల సమ్మేటివ్ పరీక్షలు జరిగాయి. ఐదో తరగతి తెలుగు పరీక్షలో“యాదాద్రి నరసింహస్వామి ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటావో తెలపండి?” అనే చిన్న ప్రశ్న ఇచ్చారు. విద్యార్థులు తమ తమ కోరికలను పరీక్ష పత్రాల్లో రాశారు. కానీ.. ఓ చిన్నారి రాసిన సమాధానం చూసి.. టీచర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ చిన్నారి జవాబు అందరి గుండెలను తాకింది. దేవుడిని తనకు ఇక దొరకని మనిషినే తిరిగి ఇవ్వమని అడిగింది ఆ చిన్నారి. “నాకు మా నాన్న కావాలి..” అనే సమాధానం. ఈ ఒక్క వాక్యం.. చూసిన ప్రతి ఒక్కరి మనసును కదిలించింది.
రెండేళ్ల క్రితం తండ్రిని కోల్పోయినా.. ఆ చిన్నారి మనసులో మాత్రం నాన్న ఇంకా బతికే ఉన్నాడు. అందుకే కావచ్చు.. దేవుడి ముందు పెట్టాల్సిన కోరికల జాబితాలో.. ఆ చిన్నారి కోరుకున్నది ఒక్కటే “మా నాన్నను తిరిగి ఇవ్వండి. రెండేళ్ల క్రితమే తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారి.. ఇప్పటికీ నాన్న జ్ఞాపకాల నుంచి బయటపడ లేదని చెప్పడానికి.. ఆ నాలుగు పదాలే సాక్ష్యం. తనను వదిలి వెళ్లిపోయిన నాన్న మళ్లీ తన దగ్గరకు రావాలని.. కోరుకుంటోంది. దేవుడిని అడిగిన వరం కాదు ఇది.. తండ్రి కోసం ఓ చిన్నారి గుండెల్లో దాచుకున్న తీరని ఆర్తనాదం..
ఆ చిన్నారి పరీక్ష పేపర్ ను దిద్దిన ఆ టీచర్ ను ఆ జవాబు ఆలోచింపజేసింది. చిన్న మాటే.. కానీ ఆ మాటలో ఎంతటి బాధ దాగి ఉందో తెలుసుకోవాలని ఉపాధ్యాయులు ఆరా తీశారు. రెండేళ్ల క్రితం తన తండ్రి చనిపోయినట్లు విద్యార్థి చెప్పడంతో పాఠశాల ఉపాధ్యాయులంతా భావోద్వేగానికి గురయ్యారు. తండ్రిని కోల్పోయిన బాధను మరిచిపోలేకపోయిన ఆ చిన్నారి.. పరీక్ష పత్రంలో తన మనసులోని మాటను దేవుడికే చెప్పుకుంది.
డబ్బు కాదు.. బొమ్మలు కాదు.. కొత్త బట్టలు కాదు.. తనకు మళ్లీ తన నాన్న కావాలని కోరుకుంది. చిన్నారి మనసులో తండ్రి మీదున్న ప్రేమకు.. తండ్రి లేని లోటు ఎంతగా ఉందో ఆ ఒక్క వాక్యం చెప్పేసింది. దీంతో టీచర్లందరూ ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు.
కొన్ని కన్నీళ్లకు శబ్దం ఉండదు.. కొన్ని బాధలకు మాటలు రావు.. కానీ.. ఈ చిన్నారి రాసిన నాలుగు పదాలు మాత్రం.. ఆ బాధ మొత్తాన్ని ప్రపంచానికి వినిపించాయి.
