రూ.82 వేల జీతంతో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) దేశవ్యాప్తంగా 321 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 200 జనరలిస్ట్, 121 స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ప్రారంభ వేతనం రూ.82,485గా ఉంటుంది..

హైదరాబాద్, అక్టోబర్ 8: ఉద్యోగార్థులకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) కీలక అప్‌డేట్ అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ కార్యాలయాల్లో 321 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 121 స్పెషలిస్ట్ పోస్టులు, 200 జనరలిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 8 నుంచి ప్రారంభమై అక్టోబర్ 28 వరకు కొనసాగనుంది. అర్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం, పరీక్షా విధానం తదితర పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.
నవంబర్ 17న ఫేజ్ 1 పరీక్ష
ఎంపిక ప్రక్రియలో భాగంగా మొదటి దశలో ఫేజ్-1 ఆన్‌లైన్ పరీక్షను నవంబర్ 17న నిర్వహించనున్నారు. ఫేజ్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశగా ఫేజ్ 2 పరీక్షను డిసెంబర్ 22న నిర్వహిస్తారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టులకు ప్రారంభ వేతనం రూ.82,485గా ఉంటుంది. వివిధ స్పెషలిస్ట్ విభాగాలతో పాటు జనరలిస్ట్ విభాగంలోనూ అవకాశాలు ఉండటంతో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నియామకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ నియామకానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అక్టోబర్ 8 నుంచి అందుబాటులోకి రానుంది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, తమ అర్హతలు, వయోపరిమితి, పరీక్షా విధానం, ఫీజు, ఇతర నిబంధనలను నిర్ధారించుకోవాలి.
